కరోనా అదుపుపై శుభ వార్త తెలియజేసిన భారత వైద్య పరిశోధన సంస్థ



న్యూ ఢిల్లీ :  దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న కరోనా మహమ్మారి రోజు రోజుకి మరింతగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో భారత వైద్య పరిశోధన సంస్థ ఒక శుభవార్త చెప్పింది. దేశంలో కరోనా బాధితుల్లో 90 శాతం మంది సాధారణ వైద్యంతోనే కోలుకుంటున్నారని ఒక్క శాతం రోగులకు మాత్రమే వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించాల్సి వస్తోందని ఐసీఎంఆర్ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలపై ఐసీఎంఆర్ చేసిన అధ్యయన వివరాలను సంస్థ డిప్యూటీ డైరెక్టర్ గంగా కేడ్కర్ తెలిపారు. దేశంలో బుధవారం ఉదయం వరకు నిర్వహించిన పరీక్షల్లో 19484 మందికి పైగా కరోనా వైరస్ సోకినట్లు తేలింది. 
కరోనా బారిన పడిన వారిలో 3870 మంది కోలుకున్నారు.. 640 మంది మరణించారు. వృద్ధులు - దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు - వ్యాధి నిరోధక శక్తి అతి తక్కువగా ఉన్న వారు మాత్రమే మరణిస్తున్నారు అని తెలిపారు. దేశంలో కరోనా వైరస్ సోకిన 69 శాతం మందిలో కరోనా వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపించలేదు.

అయితే వీరి ద్వారానే ఎక్కువ మందికి కరోనా వ్యాపిస్తోంది. కరోనా సోకిన 14 రోజుల్లోపు కరోనా లక్షణాలు బయటపడతాయి అని వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో నాలుగైదు రోజుల్లోనే లక్షణాలు బయట పడతాయి అని వ్యాధి నిరోధకశక్తి ఎక్కువగా ఉన్న వారిలో 14 రోజుల తర్వాత కూడా బయటపడవు అని తెలిపారు. కరోనా బారిన పడినప్పటికీ 69 శాతం మందిలో కరోనా లక్షణాలు కన్పించకపోవడానికి కారణం వారిలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉండటమే అని తెలిపారు. మన దేశంలో కరోనా సోకినా లక్షణాలు కన్పించని వారి నుంచి ఆ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని.. అది ఎంత శాతం అన్నది తేలాల్సి ఉంది.