చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు

కోవిడ్‌ కట్టడి చర్యల్లో ఆంధ్రప్రదేశ్‌ మెరుగైన పనితీరు కనబరుస్తుంటే.. పచ్చ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అన్నారు. విషయం తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని టీడీపీ నేతలకు ట్విటర్‌ వేదికగా హితవు పలికారు. ‘కరోనా వైరస్ అంటే దోమలపై యుద్ధం, ఎలుకలు పట్టడం లాంటిది కాదు చంద్రబాబూ. దోమలను నియంత్రించావా? వైరస్సూ అంతే. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నవాడివి నీకేం తెలుసని వైఎస్‌ జగన్ గారిపై విషం చిమ్ముతున్నావు? ప్రజల గురించి మొసలి కన్నీళ్లు కార్చవద్దు. కరోనా కట్టడిలో రాష్ట్రమే ముందు నిలుస్తుంది’అని పేర్కొన్నారు.
వ్యాక్సిన్ వచ్చేదాక కరోనాతో సహజీనం తప్పదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పింది 100 శాతం సరైందని విజయసాయిరెడ్డి అన్నారు. వైరస్ నిర్మూలనకు నేరుగా పనిచేసే మందులేవీ ఉండవని, వ్యాధి లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్లాస్మా థెరపీ ఆశలు రేకిత్తిస్తోందని, కేంద్రం కూడా దీనికి అనుమతించిందని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా సీఎం వైఎస్‌ జగన్‌ డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ నిధులు, విద్యా దీవెన కింద రూ.4 వేల కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. వాటిలో బాబు హయాంలోని బకాయిలూ ఉన్నాయని వెల్లడించారు.