కరోనా:బయంకరమైన నిజం

కరోనా వైరస్‌ కట్టడికి కఠిన చర్యలు చేపట్టకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో హెచ్చరించారు. వేగంగా విస్తరిస్తున్న కోవిడ్‌-19ను నివారించేందుకు యుద్ధప్రాతిపదకన చర్యలు చేపట్టాలని తోటి గవర్నర్లను కోరారు. తాము ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితే మున్ముందు మరిన్ని ప్రాంతాలకు రావొచ్చని హెచ్చరించారు. కరోనా వ్యాప్తి ఇలాగే కొనసాగితే న్యూయార్క్‌లో 16 వేల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఓ సంస్థ నిర్వహించిన అధ్యయంలో ఈ భయంకర వాస్తవం వెల్లడైందన్నారు. వైరస్‌ను నిర్మూలించేలోపు 16 వేల న్యూయార్క్‌ వాసులతో పాటు 93 వేల మంది అమెరికన్లు మృత్యువాత పడే అవకాశముందని ఈ అధ్యయం అంచనా వేసింది. 

అమెరికాలో కరోనా మహమ్మారికి న్యూయార్క్‌ ప్రధాన కేంద్రంగా మారింది. బుధవారం నాటికి ఇక్కడ 83,712 మంది కరోనా బారిన పడ్డారు. రాత్రికి రాత్రే 10 శాతం పెరిగి కొత్తగా 7,917 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క న్యూయార్క్‌ నగరంలోనే దాదాపు 50 వేల మందికి కోవిడ్‌ సోకింది. గత 24 గంటల్లో సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్‌ రాష్ట్రంలో ఇప్పటివరకు 1,941 మరణాలు నమోదయ్యాయి. 

మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని గవర్నర్‌ ఆండ్రూ క్యూమో ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్‌ చివరి నాటికి ఆస్పత్రుల్లో 75 వేల బెడ్‌లు, 25 వేల వెంటిలేటర్లు అవసరమని ఆయన అంచనా వేశారు. పరిస్థితి మరీ దారుణంగా ఉంటే 1,10,000 బెడ్‌లు, 37,000 వెంటిటేర్లు కావాల్సి ఉంటుందన్నారు.  కరోనా బారిన పడకుండా ఉండేందుకు సామాజిక దూరం పాటించాలని న్యూయార్క్‌ వాసులకు ఆయన విజ్ఞప్తి చేశారు. పౌరులు గుమిగూడకుండా చేయడానికి ఆట మైదానాలను మూసివేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.