లాక్‌డౌన్‌: విమానాలు ఎగరబోతున్నాయ్‌!

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతుండగా దాదాపు రెండు వారాల తర్వాత దేశీయ విమానాలు తొలిసారిగా గగనయానం చేయనున్నాయి. 18 విమానాలను నడపనున్నట్టు ఎయిర్‌ ఇండియా సీఎండీ రాజీవ్‌ బన్సల్‌ గురువారం వెల్లడించారు. మన దేశంలో చిక్కుపోయిన జర్మనీ, కెనడా, ఫ్రాన్స్‌, ఐర్లాండ్‌ పౌరులను తరలించేందుకు వీటిని నడపనున్నట్టు తెలిపారు. ఆయా దేశాల రాయబార కార్యాలయాల అభ్యర్థన మేరకు 18 చార్టడ్‌ విమానాలను నడుపుతామన్నారు. ఈ మేరకు ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నట్టు చెప్పారు. ఆయా దేశాల నుంచి విమానాలు తిరిగొచ్చేటప్పుడు ఖాళీగానే వస్తాయని స్పష్టం చేశారు. (ఎయిరిండియా పైలట్లకు షాక్)

హాంగ్‌కాంగ్‌ నుంచి వైద్య పరికరాలు తీసుకొచ్చేందుకు 4, 5 తేదీల్లో కార్గో విమానాన్ని నడపనున్నట్టు రాజీవ్‌ బన్సల్‌ తెలిపారు. దీనికి అవసరమైన అనుమతులు కూడా లభించాయని ప్రకటించారు. షాంఘై నుంచి 6న మెడిక​​ల్స్‌ తీసుకొచ్చే విమానానికి అనుమతి రావాల్సి ఉందన్నారు. ఈ విమానాల్లో ప్రయాణించే క్యాబిన్‌ క్రూ సిబ్బందికి, గ్రౌండ్‌ స్టాఫ్‌కు శానిటైజర్లు, గ్లోవ్స్‌, మాస్కులతో పాటు వ్యక్తిగత రక్షణ పరికరాలు సమకూరుస్తామన్నారు. విమానాలు తిరిగి వచ్చిన తర్వాత క్వారంటైన్‌లో ఉండాలని క్యాబిన్‌ క్రూ సిబ్బందికి సూచించినట్టు చెప్పారు.