కేంద్ర బృందం నగరంపై ప్రత్యేక దృష్టి

కరోనా పాజిటివ్‌ కేసులు హైదరాబాద్‌లో ఎక్కువగా నమోదు కావడంపై కేంద్ర బృందం నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే కరోనా  కట్టడి గురించి అధ్యయనం చేస్తున్న కేంద్ర బృందం హైదరాబాద్‌లో రెండో రోజు పర్యటన కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ డీజీపీ కార్యాలయానికి బృందం వెళ్లింది. వీరికి డీజీపీ మహేందర్‌రెడ్డి స్వాగతం పలికారు. తెలంగాణ వ్యాప్తంగా కరోనా కట్టడికి పోలీసులు, రాష్ట్రం తీసుకుంటున్నచర్యలను వారు పరిశీలిస్తున్నారు. దీనిలో భాగంగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరుణ్ బరోకా నేతృత్వంలోని బృందం డీజీపీ, ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ అ​య్యింది. రాష్ట్రంలో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయడంలో పోలీస్ శాఖ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆరా తీస్తోంది.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు తీసుకున్న చర్యలను అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో పోలీసులు తీసుకుంటున్న చర్యలు, 100 డైల్ కాల్ చేస్తే పోలీస్ శాఖ స్పందించే తీరుపై వివరాలను సేకరిస్తున్నారు. అలాగే రాష్ట సరిహద్దుల్లో పోలీసులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారని ఆరా తీస్తున్నారు. గాంధీ ఆసుపత్రికి చేరుకొని కరోనా పరీక్షలు నిర్వహించే వైరాలజీ ల్యాబ్‌ను తనిఖీ చేయనుంది. పర్యటన ముగింపు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించి ఢిల్లీ చేరుకొని క్షేత్రస్థాయి పరిస్థితిపై కేంద్రానికి నివేదిక అందజేయనుంది.