హైదరాబాద్ నగరంలో భారీగా పెరుగుతున్న యూవీ ఇండెక్స్ : ఎండలో బయటే తిరిగితే అంతే ...?

గ్రేటర్‌ సిటీజనులకు ఇది ఉపశమనం కలిగించే వార్త్త. ఈసారి వేసవిలో మండుటెండలు.. వడగాల్పుల నుంచి  నగరవాసులకు ఉపశమనం లభించనుంది.  అతినీలలోహిత వికిరణత (యూవీ రేడియేషన్‌) సైతం పరిమితం కానుండటం విశేషం. పగటి ఉష్ణోగ్రతలు మే నెలలో గరిష్టంగా 42 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. గతేడాది మే నెలలో గ్రేటర్‌ పరిధిలో గరిష్టంగా 44 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. ఈ నెలాఖరుకు హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మేర రికార్డయ్యే అవకాశాలున్నట్లు ప్రకటించింది.

సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో నగరంలో పది పాయింట్లకు పైగా యూవీ రేడియేషన్‌ (అతినీలలోహిత వికిరణత) ఇండెక్స్‌ నమోదవుతుంది. ప్రస్తుతం 8 పాయింట్లు మేనెలలో 9 పాయింట్ల మేర ఇండెక్స్‌ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల తీవ్రతను యూవీ ఇండెక్స్‌ ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ ఇండెక్స్‌ పది పాయింట్లు దాటితే చర్మం, కళ్లు, ఇతర సున్నిత భాగాలు దెబ్బతింటాయి. ప్రధానంగా ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు యూవీ ఇండెక్స్‌ ప్రభావం అధికంగా ఉంటుంది.  


గతేడాది మే నెలలో సరాసరిన 44 రోజుల పాటు వడగాల్పులు వీయడంతో వందలాది మంది వడదెబ్బకు గురయ్యారు. ఈసారి సరాసరిన 15, 20 రోజులు మాత్రమే.. అదీ మే మూడోవారంలో వడగాల్పులు వీచే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అసాధారణ వాతావరణ పరిస్థితులు, అధిక ఎండలు, వడగాల్పులకు కారణమయ్యే ఎల్‌నినో ప్రభావం ఈ వేసవిలో ఉండదు. సాధారణంగా హైదరాబాద్‌లో ఏప్రిల్‌ రెండోవారంలోనే 40 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ప్రస్తుతం 37, 38 డిగ్రీలు మాత్రమే నమోదవుతుంది. ఈనెలాఖరుకు 40 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంది. పలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మేనెలలో 45 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నప్పటికీ.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 42 డిగ్రీలు.. అదీ కొన్ని రోజుల పాటు మాత్రమే నమోదయ్యే పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నాం.–రాజారావు, వాతావరణశాఖ శాస్త్రవేత్త, బేగంపేట్‌