ఫ్లిప్కార్ట్ , అమెజాన్ కి భారీ షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం



ఇండియా : కరోనా వైరస్ కట్టడికి విధించిన 2 వ విడత లాక్ డౌన్ లో భాగంగా ఈ కామర్స్ సంస్థలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదలచేసింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ , స్నాప్‌డీల్‌ వంటి ఈ-కామర్స్‌ సంస్థలు మొబైల్‌ ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్టేషనరీ ఉత్పత్తుల విక్రయాలు జరుపుకోవచ్చంటూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. ఏప్రిల్‌ 20 నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఒక్కరోజు ముందు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యవసరాలు కాని వస్తువులను ఈ-కామర్స్‌ కంపెనీలు విక్రయించడానికి లేదని స్పష్టంచేసింది. ఈ-కామర్స్‌ విక్రయదారులు ఉపయోగించే వాహనాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈకామర్స్ సంస్థలు టీవీలు, ఫ్రిజ్ లు, మొబైల్ ఫోన్లు, వాషింగ్ మెషీన్లు సరఫరా చేయడానికి సిద్ధపడ్డాయి. ఈనేపథ్యంలో నిత్యావసరాలు, కరోనా వైరస్ మందులు, మాస్కుల వంటివి తప్ప వేరేవాటిని డెలివరీ చేయడానికి కేంద్రం ఒప్పుకోలేదు. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ నిత్యావసరాలు మించి వేరేవి ఆర్డర్లు స్వీకరించడం గానీ, వాటిని సరఫరా చేయడం గానీ కుదరదని కేంద్రం పేర్కొంది. ఈమధ్యకాలంలో షాపులకు వెళ్లక్కర్లేకుండా ఇంటి ముంగిటకే అందుబాటులోకి వచ్చాయి. మనం నెట్లో బుక్ చేస్తే కొన్ని గంటల వ్యవధిలోనే అవి వినియోగదారులకు అందుతున్నాయి. కరోనా కారణంగా ఈ కామర్స్ సంస్థలు భారీ నష్టాలు చవిచూస్తున్నాయి.