ఇంటి రుణానికి అనుబంధంగా మరో రుణం : శుభ వార్త తెలిపిన ప్రభుత్వం


జాతీయం - బిజినెస్ :  ఇంటి రుణానికి అనుబంధంగా ఇచ్చే రుణమే టాపప్‌ హోమ్‌ లోన్‌. గరిష్టంగా మంజూరు చేసే రుణం, కాల వ్యవధి అనేవి బ్యాంకుల మధ్య వేర్వేరుగా ఉండొచ్చు. ప్రస్తుతం తాము ఇంటి రుణం తీసుకున్న బ్యాంకు నుంచి టాపప్‌ హోమ్‌లోన్‌ తీసుకోవచ్చు. లేదా ఇతర బ్యాంకు నుంచి తీసుకోవాలనుకుంటే ప్రస్తుత బ్యాంకు నుంచి ఇంటి రుణాన్ని బదలాయించుకున్న తర్వాతే అందుకు వీలు పడుతుంది. ముఖ్యంగా ఈ రుణాలపై వడ్డీ రేటు చాలా తక్కువగా ఉండడం ఆకర్షణీయమని చెప్పుకోవాలి. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఎస్‌బీఐ టాపప్‌ హోమ్‌లోన్‌పై తక్కువ రేటును వసూలు చేస్తోంది. ఎస్‌బీఐలో టాపప్‌ హోమ్‌ లోన్‌పై రేటు 7.6 శాతంగా ఉంటే, ఇతర బ్యాంకుల్లో ఇది 7.85 శాతం నుంచి ప్రారంభమవుతోంది. రుణాన్ని వినియోగించుకునే విషయంలో షరతుల్లేకపోవడం మరో అనుకూల అంశం. ఈ మొత్తాన్ని పిల్లల విద్యావసరాలు, రోజువారీ అవసరాలు, ఇంటి నవీకరణ, వ్యాపారాల్లో ఇన్వెస్ట్‌ చేయడం కోసం వినియోగించుకోవచ్చు.
కనుక కరోనా వైరస్‌ సంక్షోభ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కేందుకు ఈ టాపప్‌ లోన్‌ అనుకూలమనే చెప్పుకోవాలి. అయితే, ‘‘లాక్‌డౌన్‌ సమయంలో ఇంటి రుణాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఇందుకోసం న్యాయ, సాంకేతిక మదింపు అవసరం అవుతుంది’’ అని రిటైల్‌ లెండింగ్‌ డాట్‌ కామ్‌ డైరెక్టర్‌ సుకన్యకుమార్‌ తెలియజేశారు. లాక్‌డౌన్‌ కాలంలోనే రుణం కావాలంటే వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చని సూచించారు.