నీటిలో కరోనా ఆనవాళ్లు..: భయాందోళనలో ఫ్రాన్స్ ప్రజలు

మహమ్మారి కరోనా (కోవిడ్‌-19) ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా సహా ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలపై కరాళ నృత్యం చేస్తోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే లాక్‌డౌన్‌లో ఉన్న ఫ్రాన్స్‌లో ఆదివారం నాటికి 19,718 కరోనా మరణాలు సంభవించగా... దాదాపు లక్షన్నర మంది ప్రాణాంతక వైరస్‌ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో కరోనా తీవ్రత దృష్ట్యా మే 11 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో రాజధాని పారిస్‌లోని వీధులను శుభ్రం చేసేందుకు ఉపయోగిస్తున్న నీటిలో కరోనా ఆనవాళ్లు బయటపడ్డాయనే వార్త కలకలం రేపుతోంది. దీంతో నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పారిస్‌ వాటర్‌ అథారిటీ పేర్కొంది.
ఈ విషయం గురించి ఓ అధికారి మాట్లాడుతూ.. రాజధానిలో వివిధ ప్రాంతాల నుంచి 27 నీటి నమూనాలను పరీక్షించగా.. అందులో నాలుగింటిలో వైరస్‌కు సంబంధించిన సూక్ష్మ ఆనవాళ్లను తమ లాబొరేటరీ గుర్తించిందని తెలిపారు. ఈ నీటిని పార్కులు, వీధులను శుభ్రం చేసేందుకు మాత్రమే ఉపయోగిస్తామని.. తాగునీటి సరఫరాకు ప్రత్యేక వ్యవస్థ ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే నాన్‌- పాటబుల్‌ వాటర్‌ సప్లై నిలిపివేశామని.. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. కాగా సీనీ నది, ఆర్క్యూ కెనాల్‌ నుంచి సేకరించిన నీటిని ఫౌంటేన్స్‌ నిర్వహణ, పబ్లిక్‌ పార్కుల్లో పచ్చదనం పెంచడం కోసం ఉపయోగిస్తున్నారు. అయితే ఈ నీటిలోకి కరోనా ఆనవాళ్లు ఎలా వచ్చాయోనన్న విషయం అర్థం కావడం లేదని అధికారులు తెలిపారు. ఇప్పటికే పైపుల ద్వారా సరఫరా చేసిన నీటి వల్ల ప్రమాదం పొంచి ఉందా లేదా అన్న విషయాలను, ప్రమాద తీవ్రతను విశ్లేషిస్తున్నామని పేర్కొన్నారు.