కరోనా బాధితుల్లో భయాందోళనలు తొలగించండి : ఆదేశించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ :  కరోనా నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర భయాందోళనలను తొలగించి వారిలో ధైర్యం, భరోసా కలిగించాలని.. వారిలో చైతన్యం కలిగించేలా మరిన్ని అడుగులు ముందుకు వేయాలని ముఖ్యమంత్రి ‌ అధికారులను కోరారు. వైరస్‌పట్ల అవగాహన, జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలు అవలంబిస్తున్న విపరీత పోకడ, ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించేలా అవి అనవసర కథనాలు ప్రసారం చేస్తున్నట్లు వైద్య నిపుణులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా వైఎస్‌ జగన్‌ ఈ సూచనలు చేశారు. కోవిడ్‌–19 నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదివారం తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు రాష్ట్రవ్యాప్తంగా కేసుల సరళిని, విజయవాడ, పశ్చిమ గోదావరి జిల్లాలో కేసుల పెరగడానికి గల కారణాలు సీఎంకు వివరించారు.