హాస్పిట‌ల్ లో మొబైల్ ఫోన్‌ల వాడ‌కాన్నినిషేధిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

జాతీయం :  కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా  లాక్ డౌన్ కొనసాగుతుంది . ఈ సమయంలో రాష్ట్రాలు వారి వారి నిర్ణయాలతో ప్రజల శ్రేయస్సుకి తోడ్పడుతున్నాడు .   హాస్పిట‌ల్ లోప‌ల మొబైల్ ఫోన్‌ల వాడ‌కాన్నినిషేధిస్తూ ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అయితే రోగుల స‌హాయార్థం ల్యండ్‌లైన్స్ ఏర్పాటు చేస్తామ‌ని రాష్ర్ట ప్రధాన కార్యదర్శి రాజీవా సిన్హా బుధవారం తెలిపారు.  కోల్‌క‌తాలోని బాంగూర్ హాస్పిట‌ల్‌లో కరోనా పేషెంట్స్ ఉన్న ఐసోలేష‌న్ వార్డులో రెండు మృత‌దేహాల‌ను గంట‌ల కొద్ది అలాగే వ‌దిలేశారు. దీనికి సంబంధించిన  వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. రెండు మృత‌దేహాల‌కు చాలా ద‌గ్గ‌ర్లోనే క‌రోనా రోగులు కూర్చొని ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ వైద్య సిబ్బంది నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించారు.  డెడ్‌బాడీస్‌ని త‌క్ష‌ణ‌మే తీసెకెళ్లాల్సిందిగా  బాధితులు మొర పెట్టుకున్నా సిబ్బంది ప‌ట్టించుకోలేదు. ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని అక్క‌డే ఉన్న ఓ క‌రోనా రోగి వీడియో తీసి సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వైర‌ల్ అయ్యింది. ప్ర‌భుత్వం క‌నీస జాగ్ర‌త్త‌లు కూడా తీసుకోవ‌ట్లేదంటూ నెటిజ‌న్లు ఫైర్ అయ్యారు.  ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర‌మంత్రి బాబుల్ సుప్రియో మాట్లాడుతూ...వీడియో వైర‌ల్ కావ‌డంతోనే హాస్పిట‌ల్స్ లోప‌ల మొబైల్ ఫోన్ల‌ను నిషేదించార‌ని మ‌మ‌తాస‌ర్కార్‌పై ఆరోప‌ణ‌లు గుప్పించారు. నిజాల‌ను నొక్కిపెట్టే ప్ర‌య‌త్నంలో భాగంగానే ఈ చ‌ర్య‌కు పూణుకున్న‌ట్లు ద్వ‌జ‌మెత్తారు. అంతేకాకుండా ఈ వైర‌ల్ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన మంత్రి..ఇంత జ‌రుగుతున్నా మ‌మ‌తా బెన‌ర్జీ మాత్రం దీనిపై స్పందించ‌ట్లేద‌ని, క‌నీసం అది న‌కిలీ వీడియో అని చెప్ప‌డానికి కూడా ముందుకు రావ‌ట్లేద‌ని పేర్కొన్నారు . దీన్ని బ‌ట్టి ఈ వీడియో నిజం అని న‌మ్మ‌డానికి చాలా ఆస్కారం ఉంద‌ని ట్వీట్ చేశారు.