తెలంగాణ లో పెరుగుతూనే ఉన్న కరోన కేసులు : కొత్తగా 10 కేసులు నమోదు


తెలంగాణ : రాష్ట్రంలో శుక్రవారం మరో 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, అవన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 1,132కి చేరుకుందని వివరించారు. తాజాగా 34 మంది కోలుకున్నారని, వారితో కలిపి ఇప్పటివరకు 727 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 376 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇప్పటివరకు రాష్టంలో 29 మంది కరోనా కారణంగా చనిపోయారని మంత్రి వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేసులు తగ్గుముఖం పట్టాయని, అందుకే పరీక్షలు తక్కువ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని శుక్రవారం కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా చర్చించామని చెప్పారు. దీంతో కేంద్ర మంత్రి పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు.గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం కాలాపత్తర్‌కి చెందిన 27 ఏళ్ల గర్భవతికి సిజేరియన్‌ ద్వారా డెలివరీ చేశారన్నారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారన్నారు. అనేక ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 75 సంవత్సరాల వ్యక్తి, డయాలసిస్‌ చేయించుకుంటూ చావు బ్రతుకుల్లో ఉన్న మరో కరోనా పాజిటివ్‌ రోగికి సైతం చికిత్స చేసి ఇంటికి పంపించామని ఈటల తెలిపారు. కరోనా కేసులు తగ్గినా కూడా ఎట్టి పరిస్థితుల్లో రిలాక్స్‌ అవ్వొద్దని సీఎం కోరారని, కంటైన్మెంట్‌ జోన్లలో మరింత కఠిన చర్యలు చేపట్టి వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని సూచించారని తెలిపారు. ప్రతి రోజు రెండు గంటల పాటు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. ఇతర దేశాలు, జిల్లాల నుంచి వచ్చేవారిని హోం క్వారంటైన్‌లో ఉంచుతామన్నారు. విమానాశ్రయంలోనే స్క్రీనింగ్‌ చేస్తామన్నారు. లక్షణాలు ఉంటే పరీక్షలు చేస్తామని తెలిపారు. రోడ్డు మార్గంలో వచ్చేవారిని సరిహద్దుల్లోనే చెక్‌ చేస్తున్నామని తెలిపారు.