14 రోజుల్లో ఘననీయంగా పెరిగిన కరోనా కేసులు


 దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటిదాకా 2,549 మంది మరణించారు. మొత్తం 78,003 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో 3,722 కేసులు బయటపడ్డాయి. 134 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కరోనా కేసులు 49,219 కాగా, 26,234 మంది చికిత్స అనంతరం కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. రికవరీ రేటు 33.63 శాతానికి పెరిగిందని వెల్లడించింది. దేశంలో ప్రధానంగా మహారాష్ట్రను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా 975 మంది కరోనా వల్ల కన్నుమూశారు. అలాగే 25,922 పాజిటివ్‌ కేసులు ఈ ఒక్క రాష్ట్రంలోనే నమోదు కావడం గమనార్హం.   

కరోనా కేసులు రెట్టింపయ్యే వ్యవధి క్రమంగా తగ్గుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌  తెలిపారు. గత మూడు రోజుల్లో ఈ వ్యవధి 13.9 రోజులకు చేరిందని చెప్పారు. ఆయన గురువారం ఢిల్లీలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ను(ఎన్‌సీడీసీ) సందర్శించారు. కోబాస్‌–6800 టెస్టింగ్‌ మెషీన్లను జాతికి అంకితం చేశారు. 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గత 24 గంటల్లో కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశంలో గత 14 రోజులుగా 11.1 రోజులుగా ఉన్న కరోనా కేసుల డబ్లింగ్‌ టైమ్‌ గత 3 రోజులుగా 13.9 రోజులకు చేరడం శుభపరిణామమని అన్నారు. కరోనా పరీక్షల సామర్థ్యాన్ని రోజుకు లక్షకు పెంచామన్నారు. ఇప్పటిదాకా దాదాపు 20 లక్షల పరీక్షలు నిర్వహించామని  వెల్లడించారు. అత్యాధునిక కోబాస్‌–6800 యంత్రంతో 24 గంటల్లోనే 1,200 కరోనా నమూనాలను పరీక్షించవచ్చని తెలిపారు.