మరో 14 జిల్లాలను గ్రీన్‌ జోన్లుగా మార్పు : వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌


తెలంగాణ :  రాష్ట్రంలో శుక్రవారం మరో 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, అవన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 1,132కి చేరుకుందని వివరించారు. తాజాగా 34 మంది కోలుకున్నారని, వారితో కలిపి ఇప్పటివరకు 727 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 376 మంది చికిత్స  పొందుతున్నారని తెలిపారు. 
ప్రస్తుతం ఆరెంజ్‌ జోన్‌లో ఉన్న మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, భూపాలపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, మంచిర్యాల, నారాయణపేట్, నల్లగొండ, జగిత్యాల, ఆసిఫాబాద్, జనగాం జిల్లాలను, రెడ్‌ జోన్‌లో ఉన్న వికారాబాద్‌ జిల్లాను గ్రీన్‌ జోన్‌లో చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని ఈటల తెలిపారు. సోమవారం నాటికి ఈ 14 జిల్లాలు గ్రీన్‌జోన్‌లోకి వస్తాయన్నారు.  సూర్యాపేట, వరంగల్‌ అర్బన్, నిజామాబాద్‌ ఆరెంజ్‌ జోన్‌లో, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలు రెడ్‌ జోన్‌లో కొనసాగుతాయన్నారు. ప్రస్తుతం గ్రీన్‌జోన్, ఆరెంజ్‌ జోన్లలో ఉన్న జిల్లాల్లో కేంద్ర సూచనల ప్రకారం సడలింపులు ఇచ్చామని, ఒకవేళ ఎక్కడైనా వైరస్‌ వ్యాపిస్తే చర్యలు తీసుకుంటామని వివరించారు. హైదరాబాద్‌లోని 8 సర్కిళ్లలో మాత్రమే ఎక్కువగా కేసులున్నాయని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఏడెనిమిది కంటైన్‌మెంట్‌ జోన్లు ఉన్నాయని చెప్పారు. పాతబస్తీలో కేసులు ఎక్కువగా వస్తున్నందున, అక్కడ మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని చెప్పారు. కేసుల సంఖ్యను బట్టి కంటైన్మెంట్‌ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.