తొలి టెస్టులోనే 16 వికెట్లు పడగొట్టిన హిర్వాణి

క్రీడలు :  టెస్టుల్లో పేలవంగా బౌలింగ్‌ చేయడంతో మణికట్టు స్పిన్నర్‌పై అన్నీ సందేహాలే. ఇలాంటి స్థితిలో హిర్వాణికి ‘టెస్టు’ మొదలైంది. రవిశాస్త్రి కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ ఏకైక టెస్టును నరేంద్ర తన పేరిట లిఖించుకున్నాడు.
షేన్‌వార్న్, అనిల్‌ కుంబ్లేలు లెగ్‌స్పిన్‌కు ప్రాచుర్యం కల్పించక ముందు మణికట్టు మాయాజాలం ఏమిటో ప్రపంచ క్రికెట్‌ అభిమానులు ఈ మ్యాచ్‌లోనే చూశారు. లెగ్‌బ్రేక్‌లు, గూగ్లీలు, ఫ్లిప్పర్‌లు... ఇలా అన్ని ఆయుధాలతో హిర్వాణి వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో తొలి రెండు వికెట్లు కపిల్, రవిశాస్త్రి తీయగా...తర్వాతి 8 హిర్వాణి ఖాతాలో చేరాయి. రెండో ఇన్నింగ్స్‌లో వ్యూహం మార్చిన కరీబియన్లు ముందుకొచ్చి షాట్లు ఆడుతూ హిర్వాణి లయ దెబ్బ తీసేందుకు ప్రయత్నించారు.
కానీ అద్భుతమైన టర్న్‌తో అతను ప్రత్యర్థి పని పట్టాడు. ఫలితం మరో 8 వికెట్లు. ఇందులో నాలుగు స్టంపౌట్‌లు ఉన్నాయి.  అర్షద్‌ అయూబ్, రామన్‌ చెరో వికెట్‌ తీశారు. మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 136 పరుగులిచ్చి 16 వికెట్లు తీసిన హిర్వాణి అప్పటి వరకు బాబ్‌ మాసీ (ఆసీస్‌) పేరిట ఉన్న 16/137 రికార్డును బద్దలు కొట్టాడు. 32 ఏళ్లు దాటినా హిర్వాణి తొలి టెస్టు ఘనత మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం విశేషం. అతని జోరుతో భారత్‌ ఈ మ్యాచ్‌ను 255 పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది.