కోవిడ్‌–19 నివారణ చర్యలు, వలస కూలీలపై సమీక్షలో సీఎం జగన్‌

మండుటెండలో పిల్లా, పాపలతో నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీల పట్ల ఉదారత చూపాలని, వారికి తగిన సాయం అందించాలని ముఖ్యమంత్రి  అధికారులను ఆదేశించారు. మన రాష్ట్రం మీదుగా వెళ్తున్న వలస కూలీలు కొందరు చెప్పులు కూడా లేకుండా నడుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్‌–19 నివారణ చర్యలు, వలస కూలీలు, జాగ్రత్తలు తీసుకుంటూనే సాధారణ కార్యకలాపాలు కొనసాగించడం, రైతు భరోసా కేంద్రాలు.. తదితర అంశాలపై శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలస కూలీలను వారి సొంత ఊళ్లకు పంపేందుకు బస్సులు తిప్పడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం విధివిధానాలను రూపొందించాలని చెప్పారు. నడిచి వెళ్తున్న వలస కార్మికులు.. ఎక్కడికక్కడ ప్రొటోకాల్‌ పాటిస్తూ నడిపే బస్సుల్లో 15 రోజుల పాటు ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం జగన్‌ ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.   
జాగ్రత్తలతో కార్యకలాపాలు 
► కొవీఢ్-19 విస్తరించకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూనే తిరిగి కార్యకలాపాలను ప్రారంభించేందుకు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ)ను రూపొందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో భయాందోళన, వివక్ష తగ్గించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 
► ప్రజలు వైద్యానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా చూడాలన్నారు. కరోనా రావడం తప్పు కాదని, అది పాపం కాదనే విషయాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకోపోవాల్సి ఉందని స్పష్టం చేశారు.   
ఆందోళన వద్దని తెలియజెప్పాలి 
► కోవిడ్‌ విస్తరించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూనే, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాలి. ఇందులో భాగంగా ఎక్కడెక్కడ ఎలాంటి విధానాలు పాటించాలన్న దానిపై స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) తయారు చేయాలి.  
► బస్సుల్లో పాటించాల్సిన జాగ్రత్తలు.. రెస్టారెంట్లు, మాల్స్‌లో క్రమ క్రమంగా తిరిగి కార్యకలాపాలు మొదలయ్యేలా ఎస్‌ఓపీ తయారు చేయాలి. 
► కరోనాపై ఆందోళన అవసరం లేదని, లక్షణాలు కనిపిస్తే భయపడవద్దని, అనుమానం వస్తే.. ఎవర్ని సంప్రదించాలన్న దానిపై పూర్తి వివరాలను ఇంటింటా పంచే కరపత్రంలో పొందుపరచాలి. ప్రజలు స్వతంత్రంగా ముందుకు రావడం ద్వారా పరిస్థితిలో మార్పు వస్తుంది.