కోవిడ్‌-19..పర్సనల్‌ లోన్లు తీసుకుంటున్నారా..?


కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా సాధారణ జీవన స్థితిగతులు గతి తప్పాయి. ముఖ్యంగా సగటు సామాన్య భారతీయుడి వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు తీవ్రం దెబ్బతిన్నాయని స్టేబుల్‌ ఇన్వెస్టర్‌ డాట్‌కమ్‌ వ్యవస్థాపకులు దేవ్‌ ఆశిష్‌ అన్నారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో ఆయా కంపెనీల ఆదాయాలు భారీగా పతనమవ్వడంతో చాల మంది ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం, వేతనాలు చెల్లింపులను సదరు కంపెనీలు వాయిదా వేయడం జరిగింది. దీంతో సామాన్యుడి కొనుగోలు శక్తి పడిపోయింది. భారతీయ మార్కెట్లలో నగదు ప్రవాహం క్షీణించింది. ఈ సమస్యను కొంతమేర పరిష్కరించేందుకు నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు(ఎన్‌బీఎఫ్‌సీ) స్వల్ప వడ్డీరేట్లతో కూడిన వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయని దేవ్‌ తెలిపారు. ఈ రుణాలు 7.25 శాతం తక్కువ వడ్డీ రేటుతో ప్రారంభమవుతున్నాయి. పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులు 7.25-8.25 శాతం వడ్డీతో వ్యక్తిగత రుణాలు అందిస్తున్నాయి. వీటిని కోవిడ్‌-19 వ్యక్తిగత రుణాలుగా పిలుస్తున్నారని ఆయన వెల్లడించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడేవారికి ఈలోన్లు కొంత మేర ఆదుకుంటాయన్నారు.

రుణాలు ఎవరికి అవసరం..?
ప్రస్తుత పరిస్థితుల్లో రెండు రకాల వ్యక్తులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. వేతనాలు రానీ వారు, జీతాల్లో కోతలకు గురైనవారు, సొంతవ్యాపారాల్లో ఆదాయాన్ని భారీగా కొల్పోయిన వారు ఒక వర్గం కాగా, ఇప్పటికీ కనీస వేతనాలు లేనివారు, అతితక్కువ జీతాలు తీసుకుంటున్నవారు మరో వర్గంగా ఉన్నారు.మొదటి వర్గంలో ఉన్నవారికి సాయం దొరికితే సరిపోతుంది. ఎందుకంటే వీరికి కొంత మేర జీతం రావడం, వాయిదా వేసిన జీతం రెండు మూడు నెలల కాలంలో వస్తుంది. ఆ మాత్రం దానికి రుణాలు తీసుకోవాల్సి అవసరం లేదన్నారు. ఇక రెండో వర్గంలో ఉన్న వారికి తక్కువ వడ్డీతో లభిస్తున్న వ్యక్తిగత రుణాలు తీసుకోవడం మంచిదని దేవ్‌ సూచిస్తున్నారు. తక్కువ వేతనాలు పొందుతున్నవారు వారి దైనందిన ఖర్చులకు ఆ జీతం సరిపోదు. దాంతో వారి వద్ద సేవింగ్స్‌కానీ, దీర్ఘకాలిక ప్రణాళికలు ఏవీ ఉండవు. ఈసమయంలో వచ్చే కాస్త జీతం కూడా రాకపోతే వారి పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుంది. అందువల్ల ఇటువంటి వారికి వ్యక్తిగత రుణాలు కొంత మేర ఆర్థిక ఉపశాంతిని కలిగిస్తాయన్నారు.