సుమారు 20 రకాల ఔషధాలు, వ్యాక్సిన్‌లు ఆ దేశానికి సరఫరా ....తెలంగాణ :  కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మొదటిసారిగా రష్యాకు చెందిన ఫ్రైటర్‌ సర్వీస్‌ ఏరోఫ్లోట్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చింది. 1923 నుంచి ఆపరేట్‌ అవుతున్న, ప్రపంచంలోనే అత్యంత పురాతన ఫ్రైటర్‌ సర్వీస్‌లలో ఒకటైన ఈ 50 టన్నుల కార్గో విమానం హైదరాబాద్‌ నుంచి మాస్కోకు వివిధ రకాల మందులను, వ్యాక్సిన్‌లను మోసుకెళ్లింది. రష్యా ఫెడరేషన్‌కు చెందిన అతి పెద్ద కమర్షియల్‌ కార్గో సర్వీస్‌ అయిన ఈ ఏరోఫ్లోట్‌ (ఎస్‌యూ 7012/ 7013) ఈ నెల 5న ఉదయం 11.17 గంటలకు హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. రాత్రి 12.03 గంటల సమయంలో తిరిగి వెళ్లింది. ఈ విమానంలో దాదాపు 20 రకా ల ఔషధాలు, వ్యాక్సిన్లను రష్యాకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఫ్రైటర్‌ సర్వీస్‌ కరోనా లాక్‌డౌన్‌ కాలానికి మాత్ర మే పరిమితమైనా, దీనిని వారానికి ఒకసారి నడిచే ఫ్రైటర్‌ సర్వీసుగా మార్చేందుకు హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నం ఫలిస్తే, హైదరాబాద్‌ నుంచి రష్యా, ఇతర కామన్వెల్త్‌ దేశాలకు కనెక్టివిటీ ఏర్పడుతుందని విమానాశ్రయ అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు లాక్‌డౌన్‌ దృష్ట్యా హైదరాబాద్‌ నుంచి వివిధ దేశాలకు, దేశంలోని ఇతర ప్రాంతాలకు ఎయిర్‌ కార్గో ద్వారా పెద్దఎత్తున నిత్యావసరాలు, రిలీఫ్‌ సరుకులైన ఔషధా లు, ఇంజనీరింగ్, ఐటీ, ఏరోస్పేస్, కన్సోల్‌ కార్గో రవాణా జరుగుతోంది. లాక్‌ డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 5,500 టన్నుల కార్గో రవాణా చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.