గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,900 కరోనా కేసులు...

భారత్‌లో కరోనా పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,900 కరోనా  కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 46,433కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.  కాగా, ఒక్క రోజు వ్యవధిలో ఇంత భారీ స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు 12,726 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 1,568 మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 32,138 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్యలో సగానికి పైగా మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీలలోనే ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 14, 541 కరోనా కేసులు నమోదు కాగా, 583 మంది మృతిచెందారు. గుజరాత్‌లో 5,804, ఢిల్లీలో 4,898, తమిళనాడులో 3,550, రాజస్తాన్‌లో 3,061, మధ్యప్రదేశ్‌లో 2,942, ఉత్తరప్రదేశ్‌లో 2,776 కరోనా కేసులు నమోదయ్యాయి.