తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల్లో మూడు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు


తెలంగాణ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజు అధికంగా వ్యాప్తి చెందుతుంది . కరోనా కట్టడికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన కరోనా కేసులు బయట పడటం ఆగట్లే , ఈ నేపథ్యంలోతెలంగాణ రాష్ట్రంలో 24 గంటల్లో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3 కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే రికార్డయ్యాయని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. 3 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1085కి చేరింది. 585 మందికి వైరస్ తగ్గడంతో ఇదివరకే డిశ్చార్జ్ చేశారు. సోమవారం మరో 40 మందిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం 471 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య 29 గానే ఉంది. గత 14 రోజుల నుంచి కరీంనగర్, సిరిసిల్లి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, నారాయణ్ పేటలో పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తిలో ఇప్పటివరకు ఒక్క కరోనా వైరస్ కేసు నమోదు కాలేదు. ఇటీవల కేంద్ర హోంశాఖ రాష్ట్రంలో 9 జిల్లాలు గ్రీన్ జోన్ పరిధిలో ఉన్నట్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆదివారం కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ పరిధిలో 20, జగిత్యాలలో 1 కరోనా కేసు రికార్డైంది. ఇటీవల రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే జాతీయ సగటు కన్నా తక్కువ పరీక్షలు చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.