మే 25 నుంచి విమాన సర్వీసుల పునరుద్ధరణ


దేశీయ విమానయాన కంపెనీల షేర్లు గురువారం ఉదయం ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టాయి. లాక్‌డౌన్‌తో దాదాపు 2నెలల విరామం తర్వాత సోమవారం (మే 25) నుంచి దేశీయ విమాన సర్వీసులను నడపనున్నట్లు కేంద్రం ప్రకటించడంతో ఏవియేషన్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ రంగానికి చెందిన ఇండిగో, స్పైస్‌ జెట్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, గ్లోబల్‌ వెక్టా హెలీకార్పో లిమిటెడ్‌ కంపెనీల షేర్లు 11శాతం నుంచి 8శాతం లాభపడ్డాయి. 

కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ బుధవారం కీలక ప్రకటన చేశారు. దేశంలో 2,3 నెలలుగా నిలిచిపోయిన దేశీయ (డొమెస్టిక్) విమానాలు మే 25వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని ఈయన ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. 

అయితే, కచ్చితమైన నిబంధనలను, ఆంక్షలను విమానాశ్రాయాల్లోను, విమానాల్లోను తప్పకుండా పాటించాల్సి వుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ విధివిధానాలను విమానయాన శాఖ వెల్లడిస్తుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.