మారుతీ లాభం 28 శాతం తగ్గింది

దేశీయ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో 28 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో రూ.1,831 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.1,322 కోట్లకు తగ్గిందని మారుతీ సుజుకీ తెలిపింది. అమ్మకాలు తగ్గడం, ప్రమోషన్‌ వ్యయాలు పెరగడం, తరుగుదల వ్యయాలు కూడా అధికం కావడంతో నికర లాభం తగ్గిందని వివరించింది. నికర అమ్మకాలు రూ.21,473 కోట్ల నుంచి 15 శాతం క్షీణించి రూ.18,208 కోట్లకు తగ్గాయని పేర్కొంది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 60 డివిడెండ్‌ను ప్రకటించింది.