కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కారానికి ముహూర్తం ఖరారైంది. రాష్ట్రంలోనే సముద్రమట్టానికి అత్యధిక ఎత్తున నిర్మిస్తున్న కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోతలకు ఈ నెల 29న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శ్రీకారం చుట్టనున్నారు. 29న ఉదయం 11.30 గంటలకు త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్‌స్వామి పూజ, ఆశీర్వచనాల మధ్య మర్కూక్ పంప్‌హౌస్‌లో మోటార్లను ఆన్ చేయడం ద్వారా రిజర్వాయర్‌లోకి ఎత్తిపోతలను సీఎం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రెండ్రోజులే ఉండటంతో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్‌లు ఏర్పాట్లను వేగవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. గ్రావిటీ ద్వారా గోదావరి జలాల ప్రవాహాన్ని పరిశీలించిన హరీశ్‌రావు మర్కూక్ పంపుహౌస్ చూశారు. పంపుహౌస్ నుంచి గోదావరి జలాలను విడుదల చేసేందుకు సాంకేతిక అంశాలను నీటి పారుదల శాఖ ఎస్సీ వేణు, డీఈ మధులను అడిగి తెలుసుకున్నారు. భద్రతా, తదితర ఏర్పాట్లను కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, జిల్లా సీపీ జోయల్ డేవిస్ ఇతర అధికారులు పరిశీలించారు.
అడుగు దూరంలో కొత్త చరిత్ర...
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు వానాకాలంలోనే నీటిని తరలించిన ప్రభుత్వం.. గత రెండు నెలలుగా నాలుగో దశలో మిడ్‌మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్ మీదుగా రంగనాయక్‌సాగర్ రిజర్వాయర్ వరకు అటు నుంచి మల్కాపూర్, అక్కారం, మర్కూక్ పంప్‌హౌస్‌ల మీదుగా సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో నిర్మించిన కొండపోచమ్మసాగర్‌లోకి నీటిని ఎత్తిపోసేందుకు సమాయత్తమైంది. 15 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన ఈ రిజర్వాయర్ పనులు గతంలోనే పూర్తవగా ఇందులోకి నీటిని తరలించే అక్కారం, మర్కూక్ పంప్‌హౌస్ పనులను ఇటీవలే పూర్తి చేశారు. కొండపోచమ్మసాగర్‌లోకి నీటిని తరలించేలా మర్కూక్ పంప్‌హౌస్‌లో 34 మెగావాట్ల సామర్థ్యంగల 6 పంపులను సిద్ధం చేశారు. ఇందులో రెండు పంపులను సీఎం కేసీఆర్ 29న ఆన్ చేసి నీటిని రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.