వృద్ధి సామర్థ్యం ఉన్న చిన్న సంస్థలకు ఇది దాదాపు రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులు సమకూర్చనుంది. తీవ్ర రుణ ఒత్తిళ్లలో ఉన్నవి, డిఫాల్ట్ అవుతున్న సంస్థలకు రూ. 20,000 కోట్ల మేర రుణ సదుపాయంతో .. రెండు లక్షల పైచిలుకు వ్యాపారాలకు తోడ్పాటు లభించనుంది. చిన్న సంస్థలకు చెల్లించాల్సిన దాదాపు రూ. 1 లక్ష కోట్ల బకాయీలను ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు 45 రోజుల్లో విడుదల చేస్తాయి. స్థూల దేశీయోత్పత్తిలో చిన్న, మధ్య స్థాయి కంపెనీల వాటా మూడో వంతు ఉంటుంది. ఈ రంగంలో 11 కోట్ల మంది పైగా ఉపాధి పొందుతున్నారు.
భారీ పెట్టుబడులున్న వాటిని కూడా ఎంఎస్ఎంఈల కింద వర్గీకరించేందుకు వీలుగా ఎంఎస్ఎంఈల నిర్వచనాన్ని కూడా కేంద్రం సవరించింది. టర్నోవరును ప్రాతిపదికగా తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా మరిన్ని సంస్థలు ఎంఎస్ఎంఈల పరిధిలోకి వచ్చి, ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా ప్రయోజనాలను కూడా పొందేందుకు వీలు లభించనుంది. దేశీయంగా చిన్న సంస్థలకు ఊతమిచ్చేలా రూ. 200 కోట్ల దాకా విలువ చేసే ప్రభుత్వ కొనుగోళ్లకు సంబంధించి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించే విధానాన్ని ప్రభుత్వం తొలగించింది. మరోవైపు, డిజిటల్ పేమెంట్స్ వంటి సంస్కరణలను అమలు చేసే డిస్కమ్‌లకు తోడ్పాటు లభించనుంది. వాటికి రావాల్సిన బకాయీల ప్రాతిపదికన ప్రభుత్వ రంగ పీఎఫ్సీ, ఆర్ఈసీ రూ. 90,000 కోట్ల మేర నిధులు సమకూర్చనున్నాయి.