ఒకే బిల్డింగ్‌లో ఉంటున్న 44 మందికి కరోనా వైరస్‌

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా‌ విజృంభిస్తోంది.  తాజాగా ఆగ్నేయ ఢిల్లీలోని కపాషేరా ప్రాంతంలో ఒకే బిల్డింగ్‌లో ఉంటున్న 44 మందికి కరోనా వైరస్‌ సోకింది. ఈ బిల్డింగ్‌లో  ఉంటున్న ఒక వ్యక్తికి ఏప్రిల్‌ 18న కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో అధికారుల  ఆ భవనాన్ని  సీజ్‌ చేసి, అందులో ఉంటున్న 175 మంది శాంపిల్స్‌ను సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షల కోసం పంపించారు. శనివారం 67 మంది ఫలితాలు వచ్చాయి. వారిలోమ 44 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన వారి ఫలితాలు వస్తే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. 
కాగా, ఢిల్లీలో ఇప్పటివరకు 3,738 కరోనా కేసులు నమోదవగా, 61 మంది వైరస్‌ బాధితులు మరణించారు.  మొత్తం 11 జిల్లాల్లోనూ వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం గుర్తించిన రెడ్‌జోన్ల జాబితాలో అ‍న్ని జిల్లాలను చేర్చింది. అంతేకాకుండా దేశ రాజధాని పరిధిలోని ఎన్‌‌సీఆర్‌ (నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌‌) ప్రాంతంలో హాట్‌ స్పాట్‌ జిల్లాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్రం గుర్తించింది.