ఒడిశాకు రూ.500 కోట్లు ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ


ఉంపన్‌ తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన పశ్చిమ బెంగాల్‌కు తక్షణ సాయం కింద రూ.1,000 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన శుక్రవారం బెంగాల్‌లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా మోదీ వెంట ఉన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసీర్హాట్‌లో గవర్నర్, ముఖ్యమంత్రి, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు.

అనంతరం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తుపాను వల్ల మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున అందజేస్తామన్నారు. ఒకవైపు కరోనా మహమ్మారిపై పోరాడుతూనే మరోవైపు తుపాను సహాయక చర్యలు చేపట్టడంలో సమర్థంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రధాని ప్రశంసించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంతోపాటు దేశం మొత్తం బెంగాల్‌ ప్రజలకు అండగా ఉంటుందని మోదీ చెప్పారు.  
 
రూ.లక్ష కోట్ల నష్టం: మమతా బెనర్జీ  
ఉంపన్‌  తుపాను వల్ల పశ్చిమ బెంగాల్‌కు రూ.లక్ష కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. తుపాను వల్ల సంభవించిన నష్టాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. మొత్తం నష్టాన్ని అంచనా వేయడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. పలు పథకాల కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.53 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు.  

బెంగాల్‌లో 77కి చేరిన మరణాలు  
బెంగాల్‌లో ఇప్పటిదాకా అంపన్‌ తుపాను వల్ల మరణించిన వారి సంఖ్య 77కు చేరింది. రాజధాని కోల్‌కతా సహా దాదాపు సగం జిల్లాలు అంపన్‌ ధాటికి దారుణంగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా, మొబైల్‌ సేవలను  పునరుద్ధరించారు.