షాకింగ్ న్యూస్ : తెలంగాణ లో 6 రెడ్ జిల్లాలు , వెల్లడించిన కేంద్రం

తెలంగాణ :  రాష్ట్రంలో రెడ్ జోన్‌ కేటగిరీ జిల్లాలు తగ్గాయి. గత వారం కేంద్ర ఆరోగ్య శాఖ 9 జిల్లాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించగా తాజాగా 6 జిల్లాలను మాత్రమే రెడ్‌ జోన్లుగా ప్రకటించింది. మిగిలిన జిల్లాల్లో 18 ఆరెంజ్‌ జోన్‌లో, 9 గ్రీన్‌ జోన్‌లో ఉన్నాయి. తాజా వర్గీకరణ మే 3 నుంచి అమల్లోకి వస్తుంది. దేశవ్యాప్తంగా 130 జిల్లాలను రెడ్‌ జోన్‌లో, 284 జిల్లాలను ఆరెంజ్‌ జోన్‌లో, 319 జిల్లాలు గ్రీన్‌ జోన్‌లో ఉన్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతకుముందు వారం దేశవ్యాప్తంగా 170 రెడ్‌ జోన్‌లో, 207 ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయి. వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య శాఖ కార్యదర్శులతో కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమైన అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్‌ జోన్ల వర్గీకరణపై తాజా ఉత్తర్వులను రాష్ట్రాలకు పంపారు.

మారిన ప్రాతిపదిక...: గత వారం కేవలం కేసుల (క్యుములేటివ్‌) సంఖ్య, కేసులు రెట్టింపు అయ్యేందుకు పడుతున్న కాలాన్నిబట్టి జోన్లను వర్గీకరించారు. అయితే తాజాగా ఆ ప్రాతిపదికను మరింత విస్తృతం చేసినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివ్‌ కేసుల నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరగడంతో ప్రాతిపదికన విస్తృతం చేసినట్టు తెలిపింది. కేసుల సంఖ్య, డబ్లింగ్‌ రేటు, టెస్టుల పరిధి, సర్వైలెన్స్‌ వంటి అంశాల ప్రాతిపదికన జిల్లాలను వర్గీకరించినట్టు తెలిపింది. ఇప్పటివరకు కరోనా కేసులు లేని వాటిని, గడిచిన 21 రోజుల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాని జిల్లాలను గ్రీన్‌ జోన్‌లోకి పరిగణనలోకి తీసుకోనున్నట్టు తెలిపింది.