ఆంధ్రప్రదేశ్ లో విజృంభిస్తున్న కరోనా : కొత్తగా 60 కేసులు నమోదు


ఆంధ్రప్రదేశ్‌ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజు అధికంగా వ్యాప్తి చెందుతుంది . కరోనా కట్టడికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన కరోనా కేసులు బయట పడటం ఆగట్లే , ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా గ్రీన్ జోన్‌గా ఉన్న విజయనగరం జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. బలిజిపేట మండలం చిలకపల్లి గ్రామానికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. కిడ్నీ ప్రాబ్లెమ్‌తో బాధపడుతూ విశాఖపట్నం వెళ్లిన ఆమెకు అక్కడ పరీక్ష చేయగా కరోనా సోకినట్టు తేలింది. ఆమె కొడుకులు ద్వారా ఆమెకి కరోనా సోకినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. అలాగే ఆమె కుటుంబ సభ్యులందరనీ జిల్లా ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రికి తీసుకొచ్చి కరోనా టెస్టులు చేస్తున్నట్లు డి.ఎం.హెచ్.ఓ. డాక్టర్ ఎస్.వి. రమణ కుమారి తెలిపారు. విజయనగరం జిల్లాలో వీళ్లు అన్ని చోట్లా తిరిగినట్లు సమాచారం. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అలాగే జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా కొత్తగా 60 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,777కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 7,782 శాంపిల్స్‌ పరీక్షించగా.. 60 మందికి కరోనా నిర్దారణ అయినట్టు తెలిపింది. వీరిలో తూర్పు గోదావరి జిల్లాలో 1, గుంటూరు జిల్లాలో 12, వైఎస్సార్‌ జిల్లాలో 1, కృష్ణా జిల్లాలో 14, కర్నూలు జిల్లాలో 17, విశాఖపట్నం జిల్లాలో 2 కేసులతోపాటుగా కర్ణాటకకి చెందినవి 1, గుజరాత్‌కు చెందినవి 12 కరోనా కేసులు నమోదయ్యాయి.