వలస కార్మికుల కోసం ప్రత్యేక వెబ్సైట్ : ఈ పాస్ ల జారీ


తెలంగాణ: లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో చిక్కుకున్న ఇతర ప్రాంతాల, రాష్ట్రాల ప్రజలు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్‌ సైట్‌ https://tsp.koopid.ai/epass కి అనూహ్య స్పందన వచ్చింది. ఉదయం నుంచే వేలాది మంది తమ సొంత ప్రదేశాలకు వెళ్లడానికి పోలీసులు ఇచ్చిన లింకులో దరఖాస్తు చేసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఏకంగా 7 వేల దరఖాస్తులు స్వీకరించి, వారికి ఆన్‌ లైన్‌ లోనే పాసులు జారీ చేశారు. మరో 13 వేల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. కానీ వేలాదిమంది ఒక్కసారిగా సైట్‌ ఓపెన్‌ చేయడంతో సైట్‌ మీద భారం పడి హ్యాంగ్‌ అయింది. దీంతో 3.30 తరువాత సైట్‌ పనిచేయడం నిలిచిపోయింది. ఒకేసారి అధిక దరఖాస్తులు రావడం వల్ల సైట్‌ క్రాష్‌ అయిందని, త్వరలోనే పునరుద్ధరిస్తామన్న సమా చారం కనిపించింది. రాష్ట్రంలోని పలు జిల్లా లకు చెందిన అనేక మంది పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం ఇతర ప్రాంతాలకు వచ్చారు. మార్చి 22 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అకస్మాత్తుగా లాక్‌ డౌన్‌ ప్రకటించడంతో 40 రోజులకి పైగా వారంతా ఇక్కడే చిక్కుకుపోయారు. ఆరు వారాలుగా చిక్కుకుపోయిన వీరు పోలీసులు అవకాశం ఇవ్వడంతో ఒక్కసారిగా దరఖాస్తు చేసుకున్నారని, దీంతో సైట్‌ హ్యాంగ్‌ అయిం దని డీజీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.