దేశంలోని వివిధ ప్రాంతాలకు నడవనున్న 9 రైళ్లు

జూన్‌ 1 నుంచి పలు రైళ్ల రాకపోకలకు వీలుగా సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లు సిద్ధమవుతున్నాయి. సుమారు 9 రైళ్లు ఈ రెండు స్టేషన్ల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించనున్నాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య పెరగనున్న దృష్ట్యా ప్రస్తుతం అందుబాటులో ఉన్న 10వ నంబర్‌కు అదనంగా ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు. ప్రస్తుతం బెంగళూరు – న్యూఢిల్లీ, న్యూఢిల్లీ – బెంగళూరు మధ్య రోజూ రెండు రైళ్లు సికింద్రాబాద్‌ స్టేషన్‌ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే వారానికి ఒక రైలు సికింద్రాబాద్‌ – న్యూఢిల్లీ, న్యూఢిల్లీ – సికింద్రాబాద్‌ మధ్య నడుస్తోంది.
ప్రస్తుతం నడుస్తున్న ఈ ప్రత్యేక రైళ్లతో పాటు జూన్‌ 1 నుంచి సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ల మీదుగా హైదరాబాద్‌ – న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్, నిజామాబాద్‌ – తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌ – ధానాపూర్‌ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌ – హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌ – నిజాముద్దీన్‌ దురంతో ఎక్స్‌ప్రెస్, ముంబై – భువనేశ్వర్‌ కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్‌ – ముంబై హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌ – గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్‌ – విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇవికాక మరికొన్ని రైళ్లు దక్షిణమధ్య రైల్వేలోని వివిధ ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. ప్రస్తుతం ఈ రైళ్లన్నింటిలోనూ రిజర్వేషన్లు భర్తీ అయ్యాయి. వెయిటింగ్‌ లిస్టు సైతం 80 నుంచి 100 వరకు చేరుకుంది.