రెంటచింతల (మాచర్ల): గుంటూరు జిల్లాలోని రెంటచింతల నిప్పుల కొలిమిని తలపిస్తూ ‘మంట’చింతలగా మారింది. ఇక్కడ మూడు రోజులుగా 45 నుంచి 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 47.2 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 30.8 డిగ్రీలుగా నమోదైంది. గతంలో ఇక్కడ అత్యధికంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన రికార్డు ఉంది. బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల 42–43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండీ అమరావతి డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. గుంటూరు జిల్లా జంగమేశ్వరపురంలో 44, విజయవాడలో 43.5, మచిలీపట్నంలో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పారు.