‘‘నా పేరుని దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటా’’ : సల్మాన్‌ఖాన్‌


సినిమాలు : ‘నా పేరుని దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటా’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు సల్మాన్‌ఖాన్‌. ‘సల్మాన్‌ఖాన్‌ ఫిల్మ్స్‌’(ఎస్‌కేఎఫ్‌) అనే నిర్మాణ సంస్థను స్థాపించి సల్మాన్‌ సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఎస్‌కేఎఫ్‌’లో నిర్మించనున్న సినిమాల్లో నటించే అవకాశాలు ఇప్పిస్తామన్నట్లుగా పలువురికి ఫేక్‌ ఈ–మెయిల్స్‌ అందుతున్నాయట. ఈ విషయంపై సల్మాన్‌ స్పందించారు.
‘‘నేను నటించబోతున్న సినిమాల్లో కానీ, ఎస్‌కేఎఫ్‌ సంస్థలో నిర్మించబోతున్న సినిమాల కోసం కానీ ప్రస్తుతం ఏ క్యాస్టింగ్‌ (నటీనటుల ఎంపిక) జరగడం లేదు. మేం ఎటువంటి క్యాస్టింగ్‌ ఏజెంట్స్‌ని నియమించలేదు. మా సినిమాల్లో నటించే అవకాశాలు ఇప్పిస్తామన్నట్లుగా వస్తున్న ఈ మెయిల్స్, మెసేజ్‌లను, వార్తలను  నమ్మవద్దు. ఎస్‌కేఎఫ్‌ బ్రాండ్‌ను, అలాగే నా పేరును దుర్వినియోగం చేసినవారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని సల్మాన్‌ఖాన్‌ పేర్కొన్నారు.