విదేశాల నుండి వచ్చిన వారికీ చుక్కలు చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వం


జాతీయం : వైరస్‌ లక్షణాలు లేకపోయినా, కొద్దిపాటి లక్షణాలున్నా నేరుగా క్వారంటైన్‌కే వెళ్లాలని స్పష్టం చేసింది. అందుకు సంబందించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. విదేశాల నుంచి వచ్చినవారు సొంత ఖర్చులతోనే హోటళ్లు, లాడ్జీల్లో క్వారంటైన్‌లో ఉండాలని పేర్కొంది. లాక్‌డౌన్‌ వల్ల విదేశాల్లో చిక్కుకు పోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయడం తెలిసిందే. వృద్ధులు, గర్భిణులు, తీవ్ర వైద్య సమస్యలు ఉన్నవారు, భారత్‌కు అత్యవసరంగా రావాల్సిన వారు తదితరులకు ప్రాధాన్యమిచ్చింది. అయితే స్వదేశానికి చేరుకున్న తరువాత 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండేందుకు అంగీకరించిన వారినే టికెట్‌ బుకింగ్‌కు అనుమతించింది. అలాగే కరోనా లక్షణాలు లేనివారినే ప్రయాణానికి అంగీకరించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు వారం రోజుల్లో శాన్‌ఫ్రాన్సిస్కో, కువైట్, లండన్, యూఏఈలోని అబుదాబి, వాషింగ్టన్, మనీలా, న్యూయార్క్, షికాగో, కౌలాలంపూర్‌ల నుంచి దాదాపు 2,350 మంది వస్తారని అంచనా వేశారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, కువైట్‌లకు విమానాలను పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి కూడా హైదరాబాద్‌కు వచ్చేవారు ఎక్కువగా ఉన్నారు. అరబ్‌ దేశాలు సహా మరికొన్ని దేశాల నుంచి వచ్చే వారిలో కొందరు పేదలు కూడా ఉన్నారు. అక్కడ పనిచేసే కార్మికులు, కూలీలూ ఉన్నారు. వారు హైదరాబాద్‌లో దిగాక హోటళ్లలో సొంత ఖర్చులతో ఉండాలంటే కష్టం. కాబట్టి పేదలను తమ ఆధ్వర్యంలోని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఇప్పటికే ఉన్నతస్థాయిలో చర్చ జరిగింది.
 కేంద్రం విడుదల చేసిన క్వారంటైన్‌ మార్గదర్శకాలు:
 ► విదేశాల నుంచి వచ్చేవారు నేరుగా హోటళ్లు, సర్వీస్‌ అపార్టుమెంట్లు, లాడ్జీల్లో ఉండాలి. ఆయా హోటళ్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. ► హోటళ్లలో ప్రత్యేకంగా అటాచ్డ్‌ బాత్‌రూం సదుపాయాలు ఉండాలి. అందుకు అవసరమైన డబ్బు చెల్లించుకోవాల్సిన బాధ్యత వ్యక్తులదే. ► వ్యక్తుల ఆరోగ్యపరమైన అంశాలను వైద్యులు నిర్ధారిస్తారు. ఆ ప్రకారం క్వారంటైన్‌ ఏర్పాట్లు ఉంటాయి. ► క్వారంటైన్‌లో ప్రత్యేకంగా సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 24 గంటలూ అందుబాటులో ఉండేలా ఒక డాక్టర్, నర్సు ఉండాలి. ► క్వారంటైన్‌లోని వ్యక్తి ఉష్ణోగ్రత, పల్స్‌ రేటు, బీపీ, శ్వాసకోశ రేటు తదితరాలను వైద్యుడు రోజుకోసారి పరీక్షించాలి. ► క్వారంటైన్‌లలో ఉండేవారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యుడు నిత్యం జిల్లా నిఘా, వైద్యాధికారులకు సమాచారం ఇస్తారు. ► విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తులను సందర్శకులు కలవడానికి అనుమతించరు. వారు ఫోన్‌లో మాట్లాడటానికి మాత్రమే అనుమతిస్తారు. ► వారికి వైఫై సదుపాయం కల్పిస్తారు. ఆ వ్యక్తి తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ► అత్యవసరమైతే వారికి '108' ఉచిత అంబులెన్స్‌ లేదా ఏదైనా ఇతర అంబులెన్స్‌ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ► వారుండే గదులను క్రిమిసంహారక మందులతో పిచికారీ చేయాలి. అవసరమైన తువ్వాళ్లు ప్రత్యేకంగా అందుబాటులో ఉంచాలి. ► తాజాగా వండిన ఆహారాన్ని వారుండే గదులకే పంపించాలి. ► కరోనా బాధిత దేశాల నుంచి వచ్చే వారిని ప్రత్యేక పరిశీలనలో ఉంచాలి.