టెస్టుల్లో చేజారిన టీమిండియా ‘టాప్‌’ ర్యాంక్‌


క్రీడలు :  టీమిండియా ఇప్పుడు గదధారి కాదు. ఇంటా బయటా నిలకడైన విజయాలతో టెస్టుల్లో నాలుగేళ్లుగా ఎదురులేని జట్టుగా కొనసాగిన భారత్‌ అగ్రస్థానం చేజారింది. కొత్త లెక్కల ప్రకారం ఆస్ట్రేలియా (116 పాయింట్లు) టాప్‌ ర్యాంకుకు చేరగా... న్యూజిలాండ్‌ (115) రెండో స్థానానికి ఎగబాకింది. భారత్‌ (114) మూడో ర్యాంకుకు పడిపోయింది. అయితే 2003లో టెస్టు ర్యాంకుల్ని ప్రవేశపెట్టాక టాప్‌–3 జట్ల మధ్య మరీ ఇంత అత్యల్ప వ్యత్యాసం ఉండటం ఇదే మొదటిసారి. కోహ్లి సేన 2016–17 సీజన్‌ నుంచి చక్కని ప్రదర్శనతో వరుసబెట్టి  ఒక్కో సిరీస్‌ గెలుస్తూ వచ్చింది.
దీంతో ‘టాప్‌’ ర్యాంకును చేరుకోవడంతోపాటు ఇన్నాళ్లూ పదిలపరుచుకుంది. అలా ఒకటో నంబర్‌ జట్టుగా గదను సగర్వంగా అందుకుంది. అయితే వార్షిక లెక్కల ప్రకారం 2019 మే నుంచి ఫలితాల్ని పరిగణిస్తారు. ఈ తాజా విజయాలకు 100 శాతం పాయింట్లు, గత రెండేళ్లకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. దీంతో ఆసీస్‌ ముందంజ వేయగా... భారత్‌ మూడో స్థానానికి పడిపోక తప్పలేదు. అయితే ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో మాత్రం భారతే ముందుంది.