లాక్‌డౌన్‌ సడలింపుతో తెరుచుకున్న కంపెనీలు


సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు కష్టకాలం వచ్చింది. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుతో ఇవి తెరుచుకున్నా.. మనుగడ మాత్రం ప్రశ్నార్థకంగా పరిణమించింది. ఒకవైపు ముడిసరుకు కొరత సమస్య వెంటాడుతుండగా.. మరోవైపు నైపుణ్య కార్మికులు అందుబాటులో లేకపోవడంతో మరింత కుంగదీస్తోంది. దీంతో వివిధ పరిశ్రమల్లో ఉత్పత్తులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. రెండు నెలలుగా పరిశ్రమలు మూతపడటంతో చిరు పారిశ్రామికవేత్తలను ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. తాజాగా భవనాల అద్దె, విద్యుత్‌ బకాయిల చెల్లింపు, కార్మికుల వేతనాలు, ఇతరత్రా ఖర్చులు తలకు మించిన భారంగా మారాయి. ఇప్పటికే అరకొర వర్క్‌ ఆర్డర్లతో నష్టాల బాటలో నడుస్తున్న చిన్నతరహా పరిశ్రమలకు లాక్‌డౌన్‌తో కష్టాలు మరింత  రెట్టింపయ్యాయి. ముఖ్యంగా భారీ పరిశ్రమల్లో ఉత్పత్తులు నిలిచిపోయాయి. వీటిపై ఆధారపడిన చిన్న పరిశ్రమలు ఆగమయ్యాయి. అప్పటికే తయారు చేసి గోడౌన్లలో ఉంచిన సరుకును కొనే దిక్కు లేకుండాపోయింది. మరోవైపు ముడిసరుకు కొరత, ఆర్డర్లు లేకపోవడంతో పరిశ్రమలపరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దివాలా అంచున నడుస్తున్న చిన్న పరిశ్రమలపై కరోనా విపత్తు తీవ్ర ప్రభావం చూపింది. 

నిలిచిపోయిన సరఫరా..
చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమలను ముడిసరుకు కొరత వెంటాడుతోంది. లాక్‌డౌన్‌తో పరిశ్రమల ఉత్పత్తి, ముడి సరుకు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సాధారణంగా మార్చి నెల తర్వాత పెద్దఎత్తున వర్క్‌ ఆర్డర్లు వచ్చేవి. దీంతో ముడి సరుకులకు డిమాండ్‌ ఎక్కువగా ఉండేది. కానీ కోవిడ్‌ పరిస్థితుల ప్రభావంతో ఆయా పరిశ్రమల్లో ముడిసరుకు ఉత్పత్తులు నిలిచిపోయాయి. ఫలితంగా సరఫరా ఆగిపోయింది. తాజాగా చిన్న పరిశ్రమలకు వర్క్‌ ఆర్డర్లు వస్తున్నా.. ముడిసరుకు అందుబాటులో లేకుండా పోయింది. కొన్ని పరిశ్రమల్లో పాత ముడిసరుకు నిల్వలు అందుబాటులో ఉన్నప్పటికీ వర్క్‌ ఆర్డర్లు లేకుండా పోయాయి. సూక్ష పరిశ్రమలు చాలా వరకు భారీ పరిశ్రమల జాబ్‌ ఆర్డర్లపై ఆధారపడి మనుగడ సాగిస్తుంటాయి. భారీ పరిశ్రమలు కూడా నష్టాల ఊబిలో ఉండటంతో సూక్ష్మ పరిశ్రమలకు వర్క్‌ ఆర్డర్లు లేకుండా పోయాయి.