లాక్‌డౌన్‌ సడలింపులపై పారదర్శక విధానం : కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ

 

జాతీయం : కరోనా మహమ్మారితో అత్యవసర పరిస్థితి నెలకొన్న క్రమంలో పేదల ఖాతాల్లో నేరుగా రూ . 7500 జమచేయాలని కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. కుదేలైన చిన్నమధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) తక్షణ సాయం చేయని పక్షంలో నిరుద్యోగం సునామీలా చుట్టుముడుతుందని హెచ్చరించారు. మే 17తో లాక్‌డౌన్‌ ముగుస్తున్న క్రమంలో పారదర్శకతతో కూడిన ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన కోరారు.
దేశానికి దీటైన ప్రధాని ఉంటే సరిపోదని, బలమైన ముఖ్యమంత్రులు, సమర్ధ క్షేత్రస్ధాయి నేతలు అవసరమని వ్యాఖ్యానించారు. కరోనాపై పోరు కేవలం ప్రధాని కార్యాలయానికే పరిమితమైతే మహమ్మారిపై మనం విజయం సాధించలేమని అన్నారు.  రాహుల్‌ శుక్రవారం మీడియాతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ అధికార వికేంద్రీకరణకు మొగ్గుచూపాలని హితవు పలికారు. ప్రధాని పనితీరు ఇతర సందర్భాల్లో ప్రభావవంతంగా ఉన్నా దేశం ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న క్రమంలో అధికార వికేంద్రీకరణతోనే మహమ్మారిని మట్టుపెట్టగలమన్నారు. 
రాష్ట్ర, జిల్లా, గ్రామ స్ధాయిలో నేతలు చురుకుగా పనిచేయాలని అధికార యంత్రాంగం సమన్వయంతో కదిలి సమస్యను క్షేత్రస్ధాయిలోనే నివారించాలని, జాతీయ స్ధాయిలో కాదని రాహుల్‌ పేర్కొన్నారు. దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత ఆధారంగా రెడ్‌, ఆరంజ్‌, గ్రీన్‌ జోన్లను జాతీయ స్ధాయిలో గుర్తించారని, జిల్లా మేజిస్ర్టేట్లకు తమ ప్రాంతాలపై అవగాహన ఉండే దృష్ట్యా ఈ గ్రేడింగ్‌ జిల్లా స్ధాయిలోనే జరగాల్సి ఉందన్నారు. ప్రధాని మోదీ తరచుగా సీఎంలతో మాట్లాడాలని, ఓ బాస్‌లా కాకుండా, సహచరుడిలా వ్యవహరించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య..ప్రభుత్వం ప్రజల మధ్య సమన్వయం అవసరమని అన్నారు.