కరోనా చికిత్సలో ఫలితాలిస్తున్న గిలీడ్‌ ఔషధం : వెల్లడించిన వైద్యులు

అంతర్జాతీయం : కరోనా వైరస్‌ చికిత్సలో అమెరికా గిలీడ్‌ ఔషధం సత్ఫలితాలు ఇస్తుండటంతో గురువారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడింది. ఏప్రిల్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల ముగింపు రోజు కావడంతో షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు జోరుగా సాగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 57 పైసలు పుంజుకోవడం, పారిశ్రామిక రంగానికి మరో ప్యాకేజీని కేంద్రం ఇవ్వనున్నదన్న అంచనాలు  దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను దశలవారీగా తొలగించనుండటం... ఈ అంశాలన్నీ సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్‌ 33,500 పాయింట్లపైకి, నిఫ్టీ 9,850 పాయింట్లపైకి ఎగబాకాయి. స్టాక్‌ సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 997 పాయింట్ల లాభంతో 33,718 పాయింట్ల వద్ద, నిఫ్టీ 307 పాయింట్లు ఎగసి 9,860 పాయింట్ల వద్ద ముగిశాయి.  

వారంలో నిఫ్టీ 8 శాతం అప్‌...
ఈ వారంలో సెన్సెక్స్‌ 2,390 పాయింట్లు, నిఫ్టీ 706 పాయింట్ల మేర లాభపడ్డాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 7.6 శాతం, నిఫ్టీ 7.7 శాతం చొప్పున ఎగిశాయి.  గత తొమ్మిదేళ్లలో ఈ రెండు సూచీలకు ఇది రెండో అత్యధిక వార లాభం. ఏప్రిల్‌ నెలలో సెన్సెక్స్‌ 13 శాతం, నిఫ్టీ 14 శాతానికి పైగా లాభపడ్డాయి. ఒక నెలలో నిఫ్టీ ఇంతగా లాభపడటం గత 11 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.   వాహన, చమురు, గ్యాస్, లోహ,  ఐటీ షేర్లు కూడా జోరుగా పెరిగాయి.  
4 రోజులు...రూ.7.68 లక్షల కోట్లు
గత 4 రోజుల లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.7.7 లక్షల కోట్ల మేర ఎగసింది. బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ. 7,68,168 కోట్లు ఎగసి రూ.129.41 లక్షల కోట్లకు చేరింది .