విశాఖ లో ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటన బాధితులు ఆవేదన : పరిశ్రమ ముందు ఆందోళనలు

జాతీయం , ఆంధ్రప్రదేశ్ : పరిశ్రమ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్నాం. ఏ ఉద్యోగమైనా చేసేది బతకడానికే. అలాంటిది ప్రాణాలే పోతుంటే. మాకెందుకీ పరిశ్రమ. ఇప్పుడు 12 మంది. మరోసారి ఇదే ఘటన పునరావృతమైతే ఎంత నష్టం జరుగుతుందో ఊహించుకుంటేనే భయమేస్తోంది'' అంటూ ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటన బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమను ఇక్కడి నుంచి వెంటనే తరలించాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చుట్టుపక్కల గ్రామాల యువకులు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా ఇప్పటివరకు పరిశ్రమ ప్రతినిధులు బయటకు రాకపోవడం దారుణమని మండిపడ్డారు. మృతదేహాలను గ్రామాల్లోకి తీసుకువస్తే.. గ్రామస్థులంతా ఏకమై ఎక్కడ ఆందోళన చేస్తారోనని బయటి నుంచే శ్మశాన వాటికకు తరలించారని ఆరోపించారు. ప్రమాద ఘటన తర్వాత ఐదు గ్రామాల్లోని సుమారు 15 వేల మంది చెట్టుకొక్కరు పుట్టకొకరు విడిపోయామని, ఎవరెక్కడ ఉన్నారో ఇప్పటికీ తెలియడం లేదని లక్ష్మణరావు అనే యువకుడు ఆవేదన వ్యక్తంచేశాడు. యాజమాన్యం స్పందించలేదు వెంకటాపురంలో 12 మంది మృతిచెందినా ఇప్పటివరకు యాజమాన్యం స్పందించలేదు. మృతుల కుటుంబాలను పరామర్శించలేదు. గ్యాస్‌ లీకేజీ ఘటనతో ఊరు శ్మశానంలా మారింది. ఈ ప్రమాదంలో నా మేనకోడల్ని కోల్పోయా. అంత్యక్రియలు చేయడానికి కూడా బంధువులు అందుబాటులో లేరు. అధికారులు, మంత్రులు వచ్చి కంపెనీలోకి పోతున్నారు తప్ప గ్రామాల్లోకి వచ్చి చూడలేదు.
 ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )