మాన‌వ‌త్వాన్ని చాటుకున్న అక్ష‌య్‌ కుమార్

క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాల‌ను గుర్తించే 500 స్మార్ట్ వాచ్‌ల‌ను నాసిక్ పోలీసుకు విరాళంగా అందించి బాలీవుడ్ స్థార్‌ అక్షయ్ కుమార్ మ‌రోసారి ‌తన ఉన్న‌త మ‌న‌సును చాటుకున్నారు. మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో ఇటీవ‌ల ఈ వాచ్‌ల‌ను ముంబై పోలీసుల‌కు కూడా అందించారు. ఇంత‌క ముందు కూడా అక్ష‌య్ కరోనాపై పోరాటంలో ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.3 కోట్లు, ప్రధానమంత్రి సహాయ నిధికి రూ. 25 కోట్లు విరాళం అందజేసిన విషయం తెలిసిందే. ఇక అక్ష‌య్ కుమార్ అందించిన స‌హాయంపై నాసిక్ పోలీస్ క‌మిష‌న‌ర్ విశ్వ‌స్ నంగ్రే పాటిల్ ఖిలాడీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే స్మార్ట్ వాచ్‌లు ఎలా ప‌నిచేస్తాయో, వీటి ద్వారా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు ఎలా తీసుకోవాలో క‌మిష‌న‌ర్‌ వివ‌రించారు.
క‌రోనా క‌ష్ట కాలంలో  అనేక  ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య ప్ర‌జ‌ల‌కు సినీ పరిశ్రమకు చెందిన ప్ర‌ముఖులు చేయూత‌నిస్తున్న విష‌యం తెలిసిందే. త‌మ‌కు తోచినంత స‌హాయాన్ని అందిస్తూ వారికి బాస‌ట‌గా నిలుస్తున్నారు. ఇక భార‌త్‌లో అత్య‌ధిక క‌రోనా కేసుల‌తో మ‌హారాష్ట్ర మొద‌టి వరుస‌లో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు 27,524 కేసులు బ‌య‌ట‌ప‌డ‌గా, 1029 మంది ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తికి ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టినా ప్ర‌యోజ‌నం లేక‌పోవ‌డంతో మ‌హారాష్ట్ర‌లో లాక్‌డౌన్‌ను మే 31 వ‌ర‌కు పొడిగించారు. కాగా భార‌త్‌లో  85, 840 మంది క‌రోనా బారిన ప‌డ్డారు.