ఆధునికీకరణ జరగదు..వరద పారదు

మహానగరంలో నాలాల సమస్య ఏళ్లు గడుస్తున్నా తీరడం లేదు. ప్రతి వర్షాకాలంలో వరద ముంపు సంభవించినప్పుడు సమస్య గురించి చర్చిస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం లభించడం లేదు. విశ్వనగరంగా ఎదుగుతోన్న హైదరాబాద్‌ వర్షం వస్తే అనేక ప్రాంతాల్లో ముంపు సమస్యకు గురవుతోంది. నాలాల గుండా వెళ్లాల్సిన వరద నీరు.. రోడ్లపైకి చేరుతోంది. నాలాల్లో వేస్తున్న వివిధ రకాల వ్యర్థాలు ఇందుకు ఒక కారణం కాగా.. భారీ వర్షాలొస్తే తట్టుకునే సామర్ధ్యం నాలాలకు లేదు. గంటకు 2 సెం.మీ.ల కంటే ఎక్కువ వర్షం కురిసినా మునిగే ప్రాంతాలెన్నో ఉన్నాయి. ప్రధాన ర హదారుల వెంబడి వరదకాలువల్లో సాఫీగా నీరు వెళ్లేలా చేయడం.. పెద్ద వరదకాలువల్లో(నాలాల్లో) పూడిక లేకుండా చేయడంతోపాటు నాలాలను విస్తరించి ఆధునీకరించనిదే సమస్యకు పరిష్కారం ఉండదని కిర్లోస్కర్, ఓయెంట్స్‌ సొల్యూషన్స్‌ వంటి కన్సల్టెన్సీ సంస్థలు గతంలోనే సిఫారసు చేశాయి.
జీహెచ్‌ఎంసీలో  ఈ సమస్యల పరిష్కారానికి  దాదాపు  390 కిలోమీటర్ల మేర పరిధిలోని మేజర్‌  నాలాల్ని విస్తరించాలంటే  12వేలకు పైగా ఆస్తులను తొలగించాల్సి ఉంటుందని టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక గుర్తించారు.  ఇది సాధ్యమయ్యే పనికాదని భావించి తొలిదశలో అత్యంత సమస్యాత్మకంగా ఉన్న బాటిల్‌నెక్స్‌లోనైనా నాలాలను విస్తరిస్తే  అతి తీవ్ర సమస్యలకు కొంతైనా పరిష్కారం లభిస్తుందని భావించారు. అలా దాదాపు 16 కి.మీ.ల మేరనైనా  మేజర్‌ నాలాలను విస్తరించి, ఆధునీకరించాలని భావించారు.  అందుకు దాదాపు వెయ్యి ఆస్తులు తొలగించాల్సి ఉంటుందని గుర్తించి దాదాపు 700 ఆస్తులకు సంబంధించి çపూర్తి సమాచారం సిద్ధం చేశారు.  ఇప్పటి వరకు  వాటిల్లో 25 శాతం ఆస్తులను కూడా తొలగించలేకపోయారు. అందుకు కారణాలనేకం. స్థానికుల వ్యతిరేకత, రాజకీయ కారణాలు, తదితరమైనవెన్నో వీటిల్లో ఉన్నాయి.