అంచనాలు లేకుండా వెళ్లి ఒక్క గేమ్‌ కూడా కోల్పోకుండా టైటిల్‌ సొంతం

పుల్లెల గోపీచంద్‌ ఆడే రోజుల్లో బెంగళూరులో ప్రకాశ్‌ పదుకొనే బ్యాడ్మింటన్‌ అకాడమీ తప్ప వేరే చోట అకాడమీలు ఏవీ లేవు. ఉన్నంతలో భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) లేదంటే చిన్నా చితకా శిక్షణ కేంద్రాలతోనే నెట్టుకురావాలి. అక్కడా అరకొరే సౌకర్యాలే. ఇలాంటి అత్తెసరు శిక్షణతోనే నెట్టుకొని, తట్టుకొని, నెగ్గుకొచ్చిన వారిలో అగ్రగణ్యుడు కచ్చితంగా మన తెలుగు తేజం    గోపీచందే! ఎంటెరియర్‌ క్రూసియేట్‌ లిగమెంట్‌ (ఏసీఎల్‌) ఇది మోచిప్పకు అయ్యే అరుదైన గాయం. ఇది క్రీడాకారులకు శాపం. దీనికి గురైతే ఆటే కాదు... పూర్వపు నడక కూడా కష్టమే. ఇలాంటి గాయాలకు ఇప్పుడైతే స్పోర్ట్స్‌ మెడిసిన్, అత్యాధునిక ట్రీట్‌మెంట్‌ వచ్చింది కాబట్టి రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) తేలిగ్గా బయట పడింది. మళ్లీ రాకెట్‌ పట్టింది. అయితే ఆ గాయానికి అప్పట్లో కెరీర్‌నే మూల్యంగా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురయ్యేది. కానీ గోపీచంద్‌ పట్టుదల ముందు ఏసీఎల్‌ ఓడింది. అతని అంకితభావానికి ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ చేరింది.
వరుసగా ఐదేళ్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన గోపీచంద్‌ సిడ్నీ ఒలింపిక్స్‌–2000 ఆరు నెలలపాటు తీవ్రంగా శ్రమించాడు. కానీ సిడ్నీ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ మ్యాచ్‌లు సిమెంట్‌ కోర్టులపై నిర్వహించడం గోపీచంద్‌కు మైనస్‌ పాయింట్‌ అయ్యింది. అప్పటికే మోకాలికి శస్త్ర చికిత్సలు జరిగి ఉండటంతో గోపీచంద్‌ గాయం తిరగబెట్టింది. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన గోపీచంద్‌ రెండో రౌండ్‌లో సుదీర్ఘ పోరులో ఉక్రెయిన్‌ ప్లేయర్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్‌ తర్వాత గోపీచంద్‌కు తీవ్ర జ్వరం వచ్చింది. మోకాలిలో వాపు కూడా వచ్చింది. రెండో సీడ్‌ హెంద్రావాన్‌ (ఇండోనేసియా)తో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో జ్వరంతోనే ఆడిన గోపీచంద్‌ వరుస గేముల్లో ఓడిపోవడంతో అతని ఒలింపిక్‌ కల చెదిరిపోయింది.