రేపటి నుంచి పట్టాలెక్కనున్న స్పెషల్‌ ట్రైన్లు

రేపటి(సోమవారం) నుంచి స్పెషల్ ట్రైన్లు పట్టాలెక్కనున్నాయి. పరిమిత సంఖ్యలో రైళ్ల రాకపోకలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో  విజయవాడ  మీదుగా     పద్నాలుగు రైళ్లు నడవనున్నాయి. విజయవాడ నుంచి ముంబై, భువనేశ్వర్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలకు రాకపోకలు సాగించనున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ విజయవాడ స్టేషన్‌లో అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. నాలుగు నెలల ముందునుంచే రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని​ కల్పించింది. రిజర్వేషన్ ఉన్నవారికి మాత్రమే రైల్వే స్టేషన్లోకి అనుమతి ఉంటుందని తెలిపింది. ప్రయాణికులు గంటన్నర ముందుగానే స్టేషన్‌ రావాలని రైల్వే శాఖ సూచించింది. ప్రతీ ప్రయాణికుడు తప్పని సరిగా మాస్క్ ధరించాలని నిబంధన విధించింది. ధర్మో స్కానింగ్ చేసిన తర్వాత టికెట్ ఉన్న వారికి మాత్రమే స్టేషన్లోకి అనుమతించనున్నారు అధికారులు. రైలు ప్రయాణం చేసే ప్రయాణికులు గమ్యస్థానం చేరాక అక్కడి ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందేనని రైల్వే శాఖ స్పష్టం చేసింది.