హోం డెలివరీ ద్వారా వినియోగదారులకు మద్యం

భారత్‌లో మద్యం హోం డెలివరీకి సంబంధించి ఏ విధమైన చట్టపరమైన నిబంధనలు లేవు. దీంతో ఇంటర్నేషనల్‌ స్పిరిట్స్‌ అండ్ వైన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఐఎస్‌డబ్ల్యూఏఐ).. జొమాటో, ఇతర సంస్థలతో మద్యం హోం డెలివరీకి సంబంధించి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో టెక్నాలజీ ఆధారిత హోం డెలివరీ.. బాధ్యయుత మద్యం వినియోగాన్ని ప్రొత్సహించినట్టు అవుతుందని నమ్ముతున్నట్టు జొమాటో సీఈవో మోహిత్‌ గుప్తా.. ఐఎస్‌డబ్ల్యూఏఐ ముందు ప్రతిపాదనను ఉంచారు. మరోవైపు లాక్‌డౌన్‌ నిబంధనల వల్ల రెస్టారెంట్‌లు మూసివేయడంతో జొమాటో విభిన్నంగా నిత్యావసరాలు డెలివరీ చేయడం కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

కాగా, పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో ప్రజలు వాటి ముందు బారులు తీరారు. ఈ రద్దీని తగ్గించేందుకు దేశ రాజధాని ఢిల్లీలో మద్యంపై 70 శాతం స్పెషల్‌ కరోనా ఫీజు విధించిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాలు కూడా ఇదే బాటలో సాగుతున్నాయి. ముంబైలో మాత్రం మందుబాబులను అదుపు చేయలేక కేవలం రెండు రోజుల్లోనే మద్యం దుకాణాలు మూసివేశారు.