దారిలో పడిపోయిన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పించిన రూరల్‌ ఎస్‌ఐ

అతను మద్యం మత్తులో రోడ్డు పక్కన పడిపోయాడు. పక్కనే ఇద్దరు పిల్లలు కూర్చొని ఏడుస్తున్నారు. అసలే ఎండ వేడి ఎక్కువగా ఉంది. మండే ఎండలో తండ్రి పక్కన కూర్చొని పిల్లలు ఏడుస్తున్నా దారిన వెళ్లేవారెవ్వరూ వారిని పట్టించుకోలేదు. అదే సమయంలో దారిలో వెళ్తున్న రూరల్‌ ఎస్‌ఐ సునీల్‌రెడ్డి, సిబ్బంది వారి పట్ల ఔదార్యం చాటుకున్నారు. ప్రొద్దుటూరు సమీపంలోని పెద్దశెట్టిపల్లె వద్ద ఉన్న జమ్మలమడుగు రోడ్డులో పడి ఉన్న అతన్ని చూసిన ఎస్‌ఐ సునీల్‌రెడ్డి వాహనాన్ని ఆపారు. ఏడుస్తున్న పిల్లలతో మాట్లాడగా..
చాపాడు మండలంలోని ఏటూరు నుంచి బైక్‌లో తండ్రితో కలిసి తమ స్వస్థలమైన జమ్మలమడుగుకు శుక్రవారం బయలుదేరామని చెప్పారు. అయితే  మార్గం మధ్యలో తమ తండ్రి ఇమ్మానుయేల్‌ మద్యం తాగాడన్నారు. పెద్దశెట్టిపల్లె గ్రామం దాటగానే అతనికి మత్తు ఎక్కువ కావడంతో అక్కడే పడిపోయాడని పిల్లలు ధనుష్, పునీత్‌ తెలిపారు. అంబులెన్స్‌కు ఫోన్‌ చేయగా వారు స్పందించకపోవడంతో ఎస్‌ఐ తన జీపులో ఇమ్మానుయేల్‌ను చికిత్స నిమిత్తం జిల్లా  ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఏడుస్తున్న పిల్లలకు ధైర్యం చెప్పి, వారికి ఆహారం అందించారు.