తెలంగాణ : కరోనా ఆంక్షలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం వ్యాపారులు భారీ స్థాయిలో లిక్కర్ స్టాక్ తెచ్చి పెట్టుకుంటున్నారు. రాష్ట్రంలోని 20 ఐఎంఎల్ డిపోల నుంచి అమ్మకాలు ప్రారంభమైన మూడు రోజుల్లోనే దాదాపు రూ. 450 కోట్ల విలువైన మద్యాన్ని దుకాణాల్లో నిల్వ చేసుకున్నారు. సాధారణ పరిస్థితుల్లో అయితే ఇంత విలువలో అమ్మకాలు జరిగేందుకు దాదాపు 12 రోజులు పడుతుందని, ఇప్పుడు ధరలు, విక్రయాలు పెరిగిన నేపథ్యంలో 7-10 రోజుల్లోనే ఈ స్టాక్ అమ్ముడవుతుందని బ్రేవరేజెస్ కార్పొరేషన్ వర్గాలంటున్నాయి. రోజుకు 2 లక్షల లిక్కర్ కేసులు.. రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు బుధవారం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించగా అదే రోజు నుంచి డిపోల ద్వారా విక్రయాలు కూడాప్రారంభమయ్యాయి. అయితే బుధవారమంతా గతంలో తమ వద్ద ఉన్న స్టాక్ అమ్మామని వైన్స్ యజమానులు పేర్కొనగా ఇదే విషయాన్ని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కూడా ధ్రువీకరించి వైన్స్ యజమానులకు క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ బుధవారం డిపోల నుంచి పెద్ద ఎత్తున లిక్కర్ దుకాణాలకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. డిపోల నుంచి ప్రతిరోజూ బ్రేవరేజెస్ కార్పొరేషన్‌కు వచ్చే లెక్కల ప్రకారం బుధవారం రూ. 72 కోట్ల విలువైన ఇండెంట్లు మద్యం షాపుల నుంచి వచ్చాయి. దాని ప్రకారం 72 వేలకుపైగా కేసుల లిక్కర్, 1.12 లక్షల కేసుల బీర్లు దుకాణాలకు చేరాయి. అలాగే గురువారం ఏకంగా 2 లక్షలకుపైగా లిక్కర్ కేసులు వైన్స్ బాట పట్టాయి. బీర్లు అయితే లక్ష కేసులు దాటాయి. శుక్రవారం కూడా ఇదే ఒరవడి కొనసాగింది. గురువారం జరిగిన స్థాయిలోనే శుక్రవారం కూడా డిపోల నుంచి మద్యం రవాణా జరిగింది. దీంతో ఈ మూడు రోజుల్లో 5 లక్షలకుపైగా కేసుల లిక్కర్, 3 లక్షల కేసులకుపైగా బీర్లు రాష్ట్రంలోని 2 వేలకుపైగా ఉన్న మద్యం దుకాణాలకు చేరాయి.