భూసారాన్ని బట్టి పండే పంటల గుర్తింపు


మూసీ పరీవాహకంలో కలుషిత నీటితో పండించే పంటలు తినడం వల్ల కేన్సర్‌ వంటి భయానక వ్యాధులు సంభవిస్తుండడంతో ప్రత్యామ్నాయంగా అరటి తోటల సాగుపై ప్రభుత్వం దృష్టి సారించింది.  విషతుల్యమైన మూసీ నీటి ప్రభావం.. అరటి పండ్లలో ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తుండడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపడుతోంది. రైతులు, వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించి గురువారం జరిగే సీఎం సమావేశానికి సిద్ధమైంది. కంది, పత్తికి సైతం ప్రాధా న్యమివ్వనుండడంతో వరి సాగు తగ్గే అవకాశముంది.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న సమగ్ర రైతు విధానంపై అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. గురువారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి సమక్షంలో జరగనున్న సమీక్ష కోసం సిద్ధమవుతోంది. శాస్త్రవేత్తల అభిప్రాయాల మేరకు భూసారాన్ని బట్టి పండే పంటలను గుర్తిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా పండించే వరికి బదులుగా కంది, పత్తి ఎక్కువగా సాగయ్యేలా చూడాలని, మూసీ పరీవాహకంలో అరటితోటలు వేయించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రైతులు, వివిధ వర్గాల నుంచి అధికారులు అభిప్రాయాలు సేకరించారు. జిల్లా కలెక్టర్‌తోపాటు ఉన్నతస్థాయి యంత్రాంగం  సీఎం సమీక్ష సమావేశానికి హాజరై ప్రతిపాదనల నివేదిక అందజేయనున్నారు.

ఎందుకంటే..
హైదరాబాద్‌ జంటనగరాలతో పాటు జిల్లా పరిధిలో రసాయన పరిశ్రమలు విడుదల చేస్తున్న వ్యర్థ రసాయనాల వల్ల మూసీ జలాలు కలుషితమవుతున్నాయి. కలుషిత జలాల కారణంగా భూసారం కోల్పోవడమే కాకుండా పంట ఉత్పత్తులను తినడం వల్ల కేన్సర్‌ వంటి భయానక రోగాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు ఇప్పటికే పలు సందర్భాల్లో హెచ్చరించారు. జిల్లాలో 1.30లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేయగా ఇందులో 95వేల ఎకరాలు దొడ్డురకం, 35ఎకరాల్లో సన్న రకాలను పండించారు. ఇందులో అత్యధికంగా 70వేల ఎకరాల్లో మూసీపరివాహకంలోనే సాగవుతుంది. అయితే విషతుల్యమైన మూసీ ఆయకట్టులో వరిసాగును తగ్గించి అరటితోటల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. విషతుల్యమైన మూసీ నీటి ప్రభావం అరటి పండ్లలో ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అలాగే మూసీ పరీవాహకంలో భూమి కూడా అరటితోటలకు అనుకూలమైనదిగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గతంలో భువనగిరి పరిసరాల్లో తమలపాకు తోటలు పెద్ద ఎత్తున పెంచేవారు. ఇక్కడి తమల పాకులకు అత్యంత డిమాండ్‌ ఉండేదని రైతులు చెబుతుంటారు. దీని దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం.