మాతృత్వపు ఆనందం.. వైద్యుల్లో సంతోషం..


ఎక్కడ కరోనా పాజిటివ్‌ వచ్చినా సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి పేరే వినిపిస్తోంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు నిత్యం కరోనా బాధితులతో ఆస్పత్రి కిక్కిరిసిపోతోంది. కరోనా మహమ్మారిని డాక్టర్లు సైతం సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. పేషెంట్లకు వైద్య సేవలు అందించి వారు త్వరగా కోలుకొని డిశ్చార్జి అయ్యేలా చేస్తున్నారు. అప్పటి వరకు అంతా బాగానే ఉన్నా.. వారికి అనుకోని ట్విస్ట్‌ ఎదురైంది. నిండు గర్భిణికి కరోనా పాజిటివ్‌ రావడంతో డాక్టర్లలో కాస్త ఆందోళన మొదలైంది. అప్పటి వరకు ఆ దిశగా ఆలోచించకపోయినా వెంటనే అన్ని విభాగాలను అలర్ట్‌ చేశారు. ఆస్పత్రి పాలనా యంత్రాంగంతో పాటు గైనకాలనీ, అనస్తీషియా తదితర విభాగాలకు చెందిన వైద్యులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తల్లి నుంచి బిడ్డకు వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రతలపై చర్చించి గాంధీ గైనకాలనీ విభాగం లేబర్‌ వార్డును సిద్ధం చేశారు.  

 
పాతబస్తీ ఫలక్‌నమాకు చెందిన గర్భిణి ఈ నెల 7వ తేదీన గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా మరుసటి రోజు శస్త్రచికిత్స నిర్వహించి పండంటి మగశిశువును అమ్మకడుపు నుంచి బయటకు తీశారు. పర్సనల్‌ ప్రొటెక్షన్‌ కిట్లు(పీపీఈ) ధరించిన వైద్యులు గర్భిణికి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆలస్యం చేస్తే కడుపులోని బిడ్డకు ప్రమాదమని గ్రహించి శస్త్రచికిత్స నిర్వహించారు. కరోనాను జయిస్తూ ముద్దుగా, బొద్దుగా మూడు కిలోల బరువుతో కేర్‌మంటూ మగశిశువు బయటకు వచ్చాడు. తల్లి కళ్లలో మాతృత్వపు ఆనందం.. వైద్యుల్లో సంతోషాల వెల్లువ.. కరోనా పాజిటివ్‌ గర్భిణికి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించిన ఉద్వేగపు క్షణాలవి. కరోనాను జయిస్తూ ముద్దుగా, బొద్దుగా మూడు కిలోల బరువుతో కేర్‌మంటూ మగశిశువు బయటకు వచ్చాడు. శిశువుకు ఎలాంటి వైరస్‌ సోకకుండా శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందాయి. ఇలాంటి ఘటన రాష్ట్రంలోనే మొదటిది. కరోనా డెలివరీ విజయవంతంగా నిర్వహించిన గాంధీ గైనకాలజీ హెచ్‌ఓడీ మహాలక్ష్మీతోపాటు వైద్యబృందం అనిత, షర్మిల, సంగీత, ప్రసన్నలక్ష్మీ, అపూర్వ, రాణి, మృణాళిని, అశ్విని, శ్రీలక్ష్మితోపాటు అనస్తీషియా, పిడియాట్రిక్‌ విభాగ వైద్యులను వైద్య ఉన్నతాధికారులు అభినందించారు.