మెడిసిన్‌ చదువుతున్న తెలుగు విద్యార్థుల మనోగతం


లాక్ డౌన్ కారణంగా బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన మెడికల్‌ విద్యార్థులు 50 రోజుల అనంతరం రాష్ట్రానికి చేరుకున్నారు. బంగ్లాదేశ్‌ నుంచి విమానంలో చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న 13 మంది విద్యార్థులను ఏపీ అధికారులు నెల్లూరుకి తరలించారు. అక్కడ ఓ హోటల్లోని క్వారంటైన్లలో వారిని ఉంచారు. ఈ సందర్భంగా విద్యార్థులు ‘సాక్షి’తో మాట్లాడుతూ..లాక్‌డౌన్‌ కారణంగా బంగ్లాదేశ్‌లో వారు ఎదుర్కొన్న సమస్యలు, ఏపీ ప్రభుత్వం చూపిన చొరవను వివరించారు. కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి రాకపోకలు నిలిపివేయడంతో భయాందోళనకు గురయ్యామని, కుటుంబసభ్యులను తలచుకుంటూ కుమిలిపోతున్న తరుణంలో సీఎం వైఎస్‌ జగన్‌ తమను దేవుడిలా ఆదుకున్నారని తెలిపారు. ‘భారత్‌లో లాక్‌డౌన్‌ ప్రకటించారని తెలియగానే ఆందోళన చెందాం.

మా కళాశాల హాస్టల్లో ఉండే పలు దేశాలకు చెందిన విద్యార్థులు వారి దేశాలకు వెళ్లిపోగా, తెలుగు విద్యార్థులు బంగ్లాదేశ్‌లోనే చిక్కుకుపోయాం. భారత్‌కు వచ్చేందుకుగాను విమాన టికెట్‌ కోసం ఎంతో ప్రయత్నించాం. ఢాకా నుంచి చెన్నైకి టికెట్‌లను కొనుగోలు చేస్తే బంగ్లాదేశ్‌ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి, వందే భారత్‌ యాప్‌ ద్వారా మా వివరాలిచ్చాం. చివరికి ఢాకా నుంచి చెన్నై వరకు విమానం వేసి మమ్మల్ని తీసుకువచ్చారు. ఎయిర్‌పోర్టులో దిగగానే నెల్లూరుకు చెందిన అధికారులు మమ్మల్ని రిసీవ్‌ చేసుకొని నెల్లూరుకు తరలించి మమ్మల్ని క్వారంటైన్లలో ఉంచారు. స్టార్‌ హోటల్లో గదులిచ్చి, మంచి పౌష్టికాహారం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో మేము ఏపీకి రాగలిగాం. దీనికి సహకరించిన సీఎం వైఎస్‌ జగన్‌కు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని చెప్పారు.