అత్యంత వివాదాస్పద ఫైనల్‌గా సోవియట్‌ యూనియన్, అమెరికా బాస్కెట్‌బాల్‌ జట్ల మధ్య మ్యాచ్‌


ఆర్టికల్ : బాస్కెట్‌బాల్‌ అంటేనే ముందుగా గుర్తొచ్చే పేరు అమెరికానే. ఇప్పుడే కాదు... ఎప్పటి నుంచో ఈ క్రీడను శాసిస్తోంది ఆ దేశమే. పైగా అప్పట్లో ప్రత్యేకించి ఒలింపిక్స్‌ క్రీడల్లో అమెరికా బాస్కెట్‌బాల్‌ జట్టుకు ఎదురేలేదు. మూడు దశాబ్దాలకు పైగా ఓటమి అంటేనే తెలియదు. 1936 నుంచి 1972 ఫైనల్‌ ముందు వరకు 63 మ్యాచ్‌లాడినా... అన్నింటా గెలిచిన చరిత్ర అమెరికాది. అలాంటి జట్టు మ్యూనిక్‌లోనూ ఎప్పటిలాగే అజేయంగా ఫైనల్‌ చేరింది. సోవియట్‌ యూనియన్‌ (ఇప్పుడు రష్యా)తో హోరాహోరీగా తలపడింది. కానీ ఈ పోరులో అమెరికా వెనుకబడింది. మ్యాచ్‌ ముగిసేదశకు చేరగా అమెరికా 48–49 స్కోరుతో ఓటమికి చేరువైంది. అయితే చివరి క్షణాల్లో సోవియట్‌ ఆటగాడు తప్పిదం చేయడంతో అమెరికాకు రెండు ఫ్రీ త్రోలు లభించాయి.
కొలిన్స్‌ వాటిని పాయింట్లుగా మలిచాడు. అమెరికా 50–49తో ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్‌ ముగియడానికి మూడు సెకన్లు ఉన్నాయి. సోవియట్‌ ఆటగాళ్లు ఆట కొనసాగించగా రెండు సెకన్లు అయిపోయాయి. మరో సెకను మాత్రమే మిగిలిఉన్న దశలో సోవియట్‌ జట్టు టైమ్‌ అవుట్‌ (విరామం) కోరిందని చెబుతూ రిఫరీ ఆటను నిలిపేస్తాడు. టైమ్‌ అవుట్‌ తర్వాత సోవియట్‌ జట్టు ఆట కొనసాగించినా పాయింట్‌ సాధించడంలో విఫలమవుతుంది. గెలిచామనే సంబరాల్లో అమెరికా ఆటగాళ్లు మునిగిపోతారు. కానీ ఇక్కడే అంతా గందరగోళం చోటు చేసుకుంటుంది. అదనంగా మరో మూడు సెకన్ల ఆట జరుగుతుంది. విజేత తారుమారై అమెరికా పరాజిత అవుతుంది. తమకు అన్యాయం జరిగిందని అమెరికా ఆటగాళ్లు ఏకంగా బహుమతి ప్రదానోత్సవాన్నే బహిష్కరిస్తారు. 
అమెరికా ఫ్రీ త్రోలు పూర్తయ్యాక సోవియట్‌ ఆటగాళ్లు ఆటను కొనసాగించిన సమయంలో మ్యాచ్‌ సమయాన్ని పర్యవేక్షించే అధికారి గడియారంలో మిగిలి ఉన్న సమయాన్ని సెట్‌ చేసుకోలేదని... అందుకే జరిగిన రెండు సెకన్ల ఆటను లెక్కలోకి తీసుకోకుండా సోవియట్‌ జట్టుకు ఒక సెకను బదులుగా మళ్లీ మూడు సెకన్లు ఇవ్వాల్సిందేనని మైదానంలోకి దూసుకొచ్చిన అప్పటి అంతర్జాతీయ బాస్కెట్‌బాల్‌ సంఘం (ఫిబా) సెక్రటరీ జనరల్‌ విలియమ్‌ జోన్స్‌ రిఫరీలను ఆదేశిస్తాడు. దాంతో రిఫరీ సోవియట్‌ జట్టుకు మూడు సెకన్ల సమయం ఇస్తాడు. ఆ మూడు సెకన్లలో ఏం ఒరుగుతుందిలే అనుకునేలోపే ఊహించని పరిణామం జరుగుతుంది. సోవియట్‌ ఆటగాడు ఇవాన్‌ ఈడెష్కో తమ కోర్టు వైపు నుంచి ఒంటిచేత్తో బంతిని దాదాపు 28 మీటర్ల దూరం విసురుతాడు. అమెరికా బాస్కెట్‌ వద్ద కాచుకున్న 20 ఏళ్ల అలెగ్జాండర్‌ బెలోవ్‌ ఆ బంతిని నేరుగా అందుకొని ఎంతో నేర్పుగా బాస్కెట్‌లోకి వేసేస్తాడు.
ఇలా వెనక్కి తిప్పిన సమయంతోనే అనూహ్యంగా 2 పాయింట్లు సాధించిన సోవియట్‌ జట్టు 51–50తో అమెరికాను ఓడిస్తుంది. ఈ ఫలితంతో ఖిన్నులైన అమెరికా జట్టు తుది ఫలితంపై అప్పీల్‌ చేస్తుంది. తర్జనభర్జనల తర్వాత అర్ధరాత్రి దాటాక ఐదు దేశాల సభ్యులతో కూడిన జ్యూరీ 3–2తో సోవియట్‌ యూనియన్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తుంది. క్యూబా, హంగేరి, పోలాండ్‌ సభ్యులు సోవియట్‌ యూనియన్‌కు.. ఇటలీ, ప్యూర్టోరికో సభ్యులు అమెరికాకు ఓటు వేస్తారు. జ్యూరీ కూడా తమకు అన్యాయం చేసిందని భావించిన అమెరికా ఆటగాళ్లు రజత పతకాలు ముట్టమనే పంతానికి దిగుతారు. ఇప్పటికీ ఈ రజత పతకాలు స్విట్జర్లాండ్‌లోని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) మ్యూజియంలో అలాగే ఉన్నాయి.