కేవలం నటిగానే కాదు..

‘‘జీవితంలో నేను సాధించాల్సింది ఎంతో ఉంది’’ అంటున్నారు శ్రుతీహాసన్‌. తన జీవిత లక్ష్యాల గురించి శ్రుతీ మాట్లాడుతూ –‘‘కేవలం నటిగానే కాదు.. పాటలు, కవితలు రాయడం, సినీ నిర్మాణ రంగం పట్ల కూడా నాకు ఆసక్తి ఎక్కువగానే ఉంది. నా జీవితంలో నేను సాధించాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి. ఇందుకు చాలా సమయం కూడా ఉంది. కానీ భవిష్యత్‌లో నేను ఒక మంచి తల్లిని కావాలనుకుంటున్నాను. అదే నా అంతిమ లక్ష్యం. మంచి తల్లిగా ఉండటం మహిళల జీవితాల్లో ఓ గొప్ప విజయమని నా అభిప్రాయం’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్‌’ చిత్రంలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ వల్ల ఈ సినిమా షూటింగ్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది.